ఎవరు, ఎలా చనిపోయినా బాబు ఖాతాలోనే..!!
కాకినాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నాయకుల మధ్య వాగ్వివాదం కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటోన్నారు. విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నాయకులు చేస్తోన్న ఆరోపణలను తిప్పికొడుతున్నారు. వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేస్తోన్నారు.

ఈ వివాదం కాస్త మరణాలపైకి మళ్లింది. చంద్రబాబు అరెస్ట్ అయిన అనంతరం ఆయన మీద బెంగతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 63 మంది మరణించారంటూ ఒక వర్గానికి చెందిన మీడియా చేస్తోన్న ప్రచారాన్ని, ప్రచురిస్తోన్న కథనాలపై వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగింది. గణాంకాలతో సహా వివరిస్తోంది.
చంద్రబాబు మీద బెంగతో కాకినాడలో కొందరు మరణించారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాకినాడలో ఎవరు సహజ మరణం పొందినా, ఎవరు మృతి చెందినా.. చంద్రబాబు కోసమే చనిపోయారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గతంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూసినప్పుడు కాకినాడలో ముగ్గురు మరణించారని, వారిలో ఒక వికలాంగుడు సైతం ఉన్నారని ద్వారంపూడి గుర్తు చేశారు. కాకినాడలో ఎవరు చనిపోయినా దాన్ని చంద్రబాబు ఖాతాలో కలిపేస్తోన్నారని, దీనిపై చర్చకు వచ్చే దమ్ము ఉందా? అని సవాల్ విసిరారు.

వంగవీటి రంగా హత్యానంతరం తాము కాకినాడను తాము దహనం చేశామని, అప్పుడు కాకినాడలో కర్ఫ్యూ పెట్టారని పేర్కొన్నారు. అభిమానం అంటే అది.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయితే ఎవరూ స్వచ్ఛందంగా బయటికి వచ్చి, ఆందోళనలు చేయట్లేదని ద్వారంపూడి అన్నారు. ఒక కులం వారు మాత్రమే రోడ్ల మీదికి వస్తున్నారని విమర్శించారు.
అమెరికా, యూరప్, హైదరాబాద్, బెంగళూరుల్లో ఆందోళనలు అంటూ వాట్సప్ గ్రూపుల్లో మెసేజీలు పెట్టుకుంటున్నారని ద్వారంపూడి చురకలు అంటించారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనల పేరుతో 60, 70 సంవత్సరాల వయస్సున్న వారితో ధర్నాలను చేయిస్తోన్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ ధర్నాలు, ఆందోళనల్లో కమ్మవారు తప్ప ఎవ్వరూ లేరని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications