వారాహి యాత్ర వెనుక అసలు గుట్టు ఇదే..!!
భీమవరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జ్వరం వల్ల ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఈ సాయంత్రం భీమవరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
పార్వతిపురం మన్యం జిల్లా కురుపాంలో అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై ఎదురుదాడికి దిగారు పవన్ కల్యాణ్. జగన్‌కు వారాహికి, వరాహికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అక్షరాలను సరిగ్గా నేర్చుకోకపోతే ఇలాంటి పరిస్థితే తలెత్తుతుందని చురకలు అంటించారు.

పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు భీమవరానికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. భీమవరం, గాజువాక ఓటర్లు పవన్ కల్యాణ్‌ను మెడపట్టి గెంటేశారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు వారాహి యాత్ర పేరుతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తిరుగుతున్నాడని విమర్శించారు.
గోదావరి జిల్లాల్లో భారీ సంఖ్యలో ఉన్న కాపు ఓటుబ్యాంకును ఆకర్షించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయాలనేదే ఈ వారాహి యాత్ర ఉద్దేశమని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు. వంగవీటి రంగాను హత్య చేయించిన చంద్రబాబుతో పవన్ కల్యాణ్ చేతులు కలుపుతున్నాడని, దీన్ని కాపు సామాజిక వర్గం ఎప్పటికీ స్వాగతించదని అన్నారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పింగళి దశరథ్ రామ్‌ను హత్య చేయించిన చంద్రబాబుతో ఎందుకు పవన్ కల్యాణ్ అంటకాగుతున్నాడని ధ్వజమెత్తారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రలు, హత్యలేనని మండిపడ్డారు. రైతులపై కాల్పులు జరిపించాడని, ఆంగన్‌వాడి కార్యకర్తలను గుర్రాలతో తొక్కించాడని గుర్తు చేశారు.

తనది కాని తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు నుంచి లాక్కున్నాడని, ఆయన మరణానికి కారకుడయ్యాడని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. అలాంటి కుట్ర రాజకీయాలు చేసే చంద్రబాబు పంచన పవన్ కల్యాణ్ ఎందుకు చేరాలని ఉబలాటపడుతున్నారని ప్రశ్నించారు. 2014 తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నో అక్రమాలకు పాల్పడినప్పటికీ ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని అన్నారు.












Click it and Unblock the Notifications