కేంద్రంతో మరింత సన్నిహితంగా..!!
న్యూఢిల్లీ/అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి చేరుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేయబోతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్లమెంట్‌ను రద్దు చేసినా చేయొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. జమిలి ఎన్నికలు లేదా మధ్యంతరం వైపు మొగ్గు చూపొచ్చనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది.
దీన్ని మరింత బలపరిచేలా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి.

ఇందులో ఎలాంటి అంశాలు, బిల్లులు చర్చకు రానున్నాయనేది ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ భేటీ సందర్భంగా సభలో ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనిపై ఇదివరకే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని మోదీకి లేఖ సైతం రాశారు.
ఇదిలా వుండగా- ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంల కేంద్ర ప్రభుత్వం అఖిల సభాపక్ష నేతలతో సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంట్ సెంట్రల్ లైబ్రరీ హాలులో ఈ మధ్యాహ్నం ఈ భేటీ ఏర్పాటైంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ భేటీకి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీ విజయసాయిరెడ్డి హాజరయ్యరు. ప్రత్యేక సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చే అజెండాపై చర్చించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ సమావేశాలు- ఫలప్రదమౌతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కీలక అంశాలు సభలో చర్చల సందర్భంగా ప్రస్తావనకు వస్తాయని ఆశిస్తున్నట్లు వివరించారు.

వైఎస్ఆర్సీపీ.. కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసిందే. ఎక్కడే గానీ ఘర్షణ వైఖరికి దిగట్లేదు. స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో తెప్పించుకోగలుగుతోంది వైసీపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిధులు బకాయిలు, జీఎస్టీ వాటాలను సాధించుకుంటోంది.
దీనికి ప్రతిగా పార్లమెంట్‌లో కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి అండగా నిలుస్తోంది. ఇదే వైఖరిని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది.. ఎన్డీఏలో భాగస్వామ్యపక్షం కాకపోయినప్పటికీ. ఇక బిల్లులను ఆమోదించడంపై కేంద్రానికి మద్దతు పలకడం లాంఛనప్రాయమే.












Click it and Unblock the Notifications