వాళ్లకు నేనేంటో చూపిస్తా: సాయిరెడ్డి
Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
మీడియా కథనాలపై..
విశాఖపట్నంలో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన.. పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్‌తో కలిసి మాట్లాడారు. తనపై ఓ వర్గానికి చెందిన మీడియాలో వస్తోన్న వరుస కథనాలపై నిప్పులు చెరిగారు. ఉద్దేశపూరకంగానే వాటిని వండివార్చుతున్నారంటూ మండిపడ్డారు.

చర్యలు తీసుకుంటా..
అసత్య వార్తలను రాసి, తన వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వాళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో.. అన్ని రకాలుగా తన నిర్ణయాలు ఉండబోతోన్నాయని అన్నారు. ఈ విషయంలో సొంత పార్టీ వాళ్లయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నా..
తనపై అసత్యాలను రాసి, ఏ మాత్రం ఆధారాలు లేని వార్తలను ప్రసారం చేసిన మూడు తెలుగు న్యూస్ ఛానళ్ల పేర్లను వెల్లడించారాయన. అందరూ కలిసి కుట్ర పన్ని వ్యక్తిత్వ హననానికి దిగారని ధ్వజమెత్తారు. చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకుంటానని అన్నారు. విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడని, ఏం చేస్తాడని తేలిగ్గా తీసుకోవచ్చని, ఒక్కసారి పట్టుబట్టితే వెనక్కి తగ్గనని చెప్పారు.
ఎంపీగా..
ఒక ఎంపీగా తనకు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వసతులు ఉన్నాయో.. వాటన్నింటినీ ఉపయోగించి, తప్పుడు వార్తలు రాసిన వాళ్లకు బుద్ధి చెబుతానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆ చర్యలు ఎలా ఉంటాయనేది చెప్పి మరీ చేస్తానని, మీడియాకు వెన్నుపోటు పొడిచే ఉద్దేశం లేదని అన్నారు.
ప్రివిలేజ్ మోషన్..
వాళ్లకు వ్యతిరేకంగారాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ సైతం ప్రవేశపెడతానని, ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తానని సాయిరెడ్డి చెప్పారు. జాతీయ మహిళా కమిషన్, జాతీయ గిరిజన కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని వివరించారు.
త్వరలో ఛానల్..
తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే మీడియాకు వ్యతిరేకంగా త్వరలోనే ఓ ఛానల్‌ను స్టార్ట్ చేస్తానని సాయిరెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశానని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రాపకం కోసం కాకుండా తటస్థంగా ఉండేలా తన ఛానల్ ఉంటుందని వివరించారు.
టీడీపీ గుండాకు సవాల్..
తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ గుండా తనను కించపరిచేలా మాట్లాడాడని, ఇంటికి వస్తే పారిపోయానంటూ ప్రచారం చేసుకుంటోన్నాడని సాయిరెడ్డి చెప్పారు. ఆ గుండాకు తాను ఒకటే చెబుతున్నానని, టైం, ప్లేస్ చెబితే తానే అక్కడికే వస్తా, ఎవరి దమ్ము ఎంతో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications