జగన్ పార్టీలోకి టిడిపి నేత జాహెద్ అలీఖాన్ తనయుడు
హైదరాబాద్: పాతబస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు జాహేద్ ఆలీ ఖాన్ తనయుడు, ఉర్దూ దిన పత్రిక సియాసత్ ఎడిటర్ అమీర్ ఆలీ ఖాన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. గత కొంత కాలం నుంచి దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అమీర్ ఆలీ ఖాన్ 2009 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేశారు.
జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్న సమయంలోనే అమీర్ ఆలీ ఖాన్ ఆయనను కలిసినట్లు తెలిసింది. అప్పుడే పార్టీలో చేరే విషయమై చర్చించినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాను పార్టీని వీడేందుకు సిద్ధమని అమీర్ తండ్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు జాహేద్ ఆలీ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. కాగా తనకు తానుగానే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇది ఇలా ఉండగా అసదుద్దీన్ ఓవైసీ చాలా సందర్భాల్లో తనకు జగన్మోహన్ రెడ్డి మంచి స్నేహితుడు అని చెప్పారు. అయితే అసదుద్దీన్‌కు ప్రత్యర్థిగా ఉన్న అమీర్ ఆలీ ఖాన్ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అసదుద్దీన్, జగన్మోహన్ రెడ్డిల మధ్య కొనసాగుతున్న సంబంధం కొంత వరకు మసకబారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమీర్ ఆలీ ఖాన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి అమీర్‌ను బరిలోకి దించుతున్నందున ఎంఐఎం పార్టీ ఆ స్థానంలో తమ అభ్యర్థిని నిలపబోదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంఐఎం నాయకులు మాత్రం ఇందుకు అంగీకరించనట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని ముస్లిం వర్గాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఇందుకోసం తాను కోరిన డిమాండ్లకు జగన్మోహన్ రెడ్డి అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం కట్టుబడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాదా అని ప్రశ్నించగా.. తాను మూడు ప్రాంతాల్లోని ముస్లిం వర్గాల అభివృద్ధి కోసం కృష్టి చేస్తానని, కొత్త రాష్ట్రం ఏర్పడినా ఇది కొనసాగుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications