జడ్పి ఎన్నికలు: భూమా వాగ్వాదం, చించేసిన టిడిపి
హైదరాబాద్: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు కొన్ని చోట్ల సజావుగా సాగగా.. మరికొన్ని చోట్ల వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. శనివారం జరిగిన నెల్లూరు జిల్లా జడ్పీ పరోక్ష ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో పరోక్ష ఎన్నిక నిర్వహిస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శ్రీకాంత్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి సభ్యురాలి చేత పదవీ ప్రమాణస్వీకారం చేయిస్తుండగా.. తెలుగుదేశం నాయకులు రంగప్రవేశం చేసి ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకార పత్రాన్ని చదివించకూడదని ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల అధికారి ముందున్న మైకును తోసేశారు.
అనంతరం ప్రమాణ స్వీకార పత్రాలను చించివేశారు. ఉత్కంఠ పరిస్థితుల మధ్య జడ్పీ ఎన్నికలు సాగుతున్నాయి. కాగా, ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ 31 స్థానాలు గెలుచుకోగా.. 15 స్థానాల్లో టిడిపి విజయం సాధించింది. శనివారం జడ్పీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు వైయస్సార్ కాంగ్రెస్ జడ్పిటిసి సభ్యులు టిడిపిలో చేరారు.

ఇది ఇలా ఉండగా కర్నూలు జడ్పి కార్యాలయం వద్ద నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జడ్పి సమావేశ మందిరంలోకి తమను అనుమతించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా టిడిపికి చెందిన రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవి పుష్పవతి(టిడిపి)కి దక్కింది.
మరో వైపు ప్రకాశం జిల్లా జడ్పి ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. టిడిపి వైపు 28 మంది సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ వైపు 28 మంది సభ్యలు ఉన్నారు. ముగ్గురు వైయస్సార్ కాంగ్రెస్ సభ్యుల మద్దతు టిడిపి మద్దతు 25 నుంచి 28కి పెరిగింది. కంభం, కారంచేడు, కొత్తపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు టిడిపి కండవాలు కప్పుకుని జడ్పి సమావేశ మందిరానికి హాజరయ్యారు. జడ్పి కార్యాలయంలో ఎన్నిక కొనసాగుతుండగానే టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వారించి పరిస్థితిని సద్దు మణిగేలా చూశారు.
అయితే తమకు మరో సభ్యుడు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని తమదే జడ్పీ పీఠమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి టిడిపి శ్రేణులు. కాగా, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా టిడిపికి చెందిన చౌదరి ధనలక్ష్మి ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా టిడిపిక చెందిన గద్దె అనురాధ ఎన్నికయ్యారు. జడ్పి ఛైర్మన్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. ఏపిలో అత్యధిక జడ్పి ఛైర్మన్ స్థానాలను దక్కించుకుంది.












Click it and Unblock the Notifications