జనసేనకు దక్కే జెడ్పీ స్థానాలు - ఎవరు ఎక్కడ, లిస్టులో..!?
స్థానిక సంస్థల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల పైన సుప్రీం సూచనల మేరకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేస్తూ ప్రకటన చేసింది. తాజా పరిణామాలతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ వాయిదా పడనుంది. కాగా.. కూటమి పార్టీల్లో జెడ్పీ సీట్ల పంపకాల పైన కసరత్తు మొదలైంది. మొత్తం 28 స్థానాల్లో జనసేన, బీజేపీకి ఎన్ని సీట్లు దక్కుతాయనేది స్పష్టత వస్తోంది. దీంతో.. పవన్ ఎవరికి వీటిని కేటాయిస్తారు అనే చర్చ పార్టీలో ఉత్కంఠగా మారుతోంది.
ఏపీలో జెడ్పీ స్థానాల పై కూటమిలో కసరత్తు జరుగుతోంది. ఈ రోజుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామి నేషన్లు పూర్తి కానున్నాయి. మొత్తం 28 స్థానాల్లో సామాజిక వర్గాల వారీగా చూస్తే, షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) 5 స్థానాలు, షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) 3, వెనుకబడిన తరగతులకు (బీసీ) 6 స్థానాలు దక్కాయి. మిగిలిన 14 స్థానాలను అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచారు. మున్సిపల్ ఎన్నిక ల్లో జనసేనకు 4 కార్పోరేషన్లు, 21 మున్సిపాల్టీలు కేటాయించారు. బీజేపీకి రెండు కార్పోరేషన్లు దక్కాయి. కాగా.. జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో 30 శాతం తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. అందులో భాగంగా జనసేన 5-6 జెడ్పీ స్థానాలు డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని కీలక స్థానాలను దక్కించుకోవడానికి జనసేన పార్టీ కూటమి లో ప్రతిపాదనలు చేసింది. అందులో మూడు స్థానాల పైన స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు స్థానాల కోసం టీడీపీ- జనసేన మధ్య పోటీ నెలకొంది.

జెడ్పీ స్థానాల పై కసరత్తు
ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ మరియు జనసేన పార్టీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇరు పార్టీల ప్రముఖ నేతల వారసులు ఈ రేసులో ఉన్నారు. అయితే, ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ జనసేనకు ఇవ్వటంతో ఈ స్థానం టీడీపీ తీసుకుంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ స్థానాన్ని దక్కించుకోవడానికి జనసేన గట్టి పట్టుబడుతోంది. అదే విధంగా కాకినాడ జిల్లా పరిషత్ పీఠంపై కూడా టీడీపీ - జన సేన మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జనసేన తరఫున ముద్రగడ పద్మనాభం కుమార్తె పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది ఇక, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జెడ్పీ స్థానంలో టీడీపీ నేతలు ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంపై జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అదే విధంగా రాయలసీమ రీజియన్లో తిరుపతి జెడ్పీ పీఠాన్ని తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా, అక్కడ కూడా రెండు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎస్టీ రిజర్వ్ చేసిన స్థానాల్లోనూ ఒకటి కేటాయించాలని జనసేన కోరుతోంది. దీంతో.. ఒకటి రెండు రోజుల్లో కూటమి పార్టీల మధ్య జెడ్పీ స్థానాల కేటాయింపు పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
