Asia Cup 2023: టీమిండియాలో చేరనున్న కీలక బ్యాటర్: శ్రీలంకకు ప్రయాణం
కొలంబో: ఆసియా కప్ 2023లో భారత జట్టు విషమ పరీక్షను ఎదుర్కొంటోంది. గ్రూప్ ఏలో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. రోహిత్ సేన ముందు చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని నిర్దేశించింది పసికూన నేపాల్ జట్టు. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్.. సూపర్ 4లో అడుగు పెట్టగలుగుతుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు.. 48.2 ఓవర్లల్లో 230 పరుగులు చేసింది. నేపాల్ ఇన్నింగ్‌లో మిడిలార్డర్ కుప్పకూలినప్పటికీ- ఓపెనర్లు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. బలమైన భారత జట్టు బౌలింగ్‌ను ఎదుర్కొని నిలిచారు. నిప్పు కణికల్లాంటి బంతులకు ధీటుగా బదులిచ్చారు.

ఓపెనర్లు కుషాల్ భుర్టెల్- 38, ఆసిఫ్ షేక్- 58 పరుగులు చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 65 పరుగులు జోడించారు. ఓపెనర్లు పెవిలియన్ దారి పట్టిన తరువాత టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు. భీమ్ షక్రీ- 7, కేప్టెన్ రోహిత్ పౌడెల్- 5, కుషాల్ మళ్లా- 2 పరుగులు చేశారంతే.
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇన్నింగ్‌ను నిలబెట్టగలిగారు. గుల్షన్ ఝా-23, దీపేంద్ర సింగ్ ఐరే- 29, సోమ్‌పాల్ కమి- 48 పరుగులు చేశారు. వారి పోరాటంతో నేపాల్ 230 పరుగుల స్కోర్ చేయగలిగింది. పోరాడదగ్గ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. టీమిండియా బౌలర్లల్లో మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
టీమిండియా ముందున్న లక్ష్యం 231 పరుగులు. ఈ టార్గెట్‌ను ఛేదించగలిగితేనే జట్టు సూపర్ 4 దశకు చేరుకోగలుగుతుంది. ప్రస్తుతం రోహిత్ సేన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే ఈ మ్యాచ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు గానీ.. వాతావరణం ఎలా మారుతుందనేది ఆసక్తి రేపుతోంది.

వర్షం పడి మ్యాచ్ రద్దయితే భారత్‌కు దక్కేది ఒక్కపాయింటే. అప్పుడు నేపాల్ కూడా ఒక పాయింట్‌తో భారత్‌కు సమానంగా నిలుస్తుంది. ఈ దశలో నెట్ రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ఇప్పటికీ అక్కడ వర్షం పడుతూనే ఉంది. రాత్రి 10: 30 గంటలకు వర్షం నిలిచిపోతే డక్‌వర్త్ లూయిస్ విధానంలో భారత్.. 17.5 ఓవర్లల్లో 113 పరుగులు చేయాల్సి ఉంటుంది.
భారత జట్టు ఈ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో- కీలక బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మంగళవారం శ్రీలంకకు బయలుదేరి వెళ్లనున్నాడు. వందశాతం ఫిట్‌నెస్ సాధించిన నేపథ్యంలో జట్టుతో కలవనున్నాడు. గజ్జలలో గాయం కారణంగా ఆసియా కప్‌లో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లకు అతను దూరమైన విషయం తెలిసిందే.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతను రిహాబిలిటేషన్‌లో పాల్గొన్నాడు. ఫిట్‌నెస్‌ను సాధించాడు. ఇవ్వాళ నిర్వహించిన టెస్టుల్లోనూ అతను తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. దీనితో అతను శ్రీలంకకు బయలుదేరి వెళ్లడానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. రేపు ఉదయం కేఎల్ రాహుల్ కొలంబోకు వెళ్తాడు. అక్కడి నుంచి పల్లెకెలెకు చేరుకుంటాడు.












Click it and Unblock the Notifications