Sudha Murthy: పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు: ఆ ఇద్దరు మహిళలపై కేసు, ఏం జరిగిందంటే?
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణిగానే గాక, రచయిత, సంఘ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధామూర్తి తాజాగా, ఓ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో సాధారణంగా ఉండే ఆమె ప్రసంగాలు మహిళలు, పౌరుల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. తన మాటలతో ఆమె ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనే ఆమె ప్రసంగాలను వేలాది మంది చూస్తూ స్ఫూర్తి పొందుతున్నారు.
సుధామూర్తి ప్రసంగాలను వినేందుకు ఆమె హాజరయ్యే కార్యక్రమాలకు వందలాది మంది అభిమానులు హాజరవుతుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. సుధామూర్తి వివిధ కార్యక్రమాలకు హాజరవుతానని చెప్పకపోయినా.. ఆమె వస్తుందంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుధామూర్తి పోలీసులను ఆశ్రయించారు. అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తన పేరును దుర్వినయోగం చేస్తున్నారంటూ సుధామూర్తి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. తమ సంస్థ 50వ వార్షికోత్సవానికి హాజరుకావాలంటూ కన్నడకూట నార్తన్ కాలిఫోర్నియా(KKNC) వారు ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆమె కార్యాలయానికి ఈమెయిల్ పంపించి ఆహ్వానించారు. అయితే, ఆమెకు ఆ సమయంలో ఖాళీ లేకపోవడంతో రాలేనని తెలిపారు.
అయినప్పటికీ, సుధామూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయం సుధామూర్తికి దృష్టికి రావడంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. కేకేఎన్సీ నిర్వాహకులను సంప్రదించగా.. తాను సుధామూర్తి వ్యక్తిగత కార్యదర్శినని చెప్పి లావణ్య అనే మహిళ ఇదంతా చేసిందని వారు సుధామూర్తికి తెలిపారు.
ఇది ఇలావుండగా, మరో ఘటనలో కూడా సుధామూర్తిని పేరును కొందరు దుర్వినియోగం చేశారు. అమెరికాలో ఒక కార్యక్రమానికి సుధామూర్తి హాజరవుతారని పేర్కొంటూ.. ఈ కార్యక్రమానికి హాజరుకావాలనుకుంటున్న వారి నుంచి ఒక్కొక్కరి నుంచి 40 డాలర్ల చొప్పున వసూలు చేసింది శృతి అనే మహిళ . సెప్టెంబర్ 26న డాక్టర్ సుధామూర్తితో మీట్-అండ్-గ్రీట్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. ఈ విషయం కూడా సుధామూర్తి దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే సుధామూర్తి .. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు జయనగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో నిందితులపై ఐపీసీ సెక్షన్ 419, 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్షన్ సెక్షన్ 66(సీ), 66(డీ) కింద కేసు నమోదు చేశారు. ఈ మోసాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications