ఎన్నికల ప్రచారంలో దాడులు, మాజీ డీసీఎం తలకు తీవ్రగాయాలు, రెండోసారి స్కెచ్!
బెంగళూరు/తుమకూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు పార్టీల నాయకులు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడమే కాకుండా దాడులు కూడా చేసుకోవడం కలకలం రేపింది. ప్రత్యర్థుల రాళ్ల దాడుల్లో కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ జీ. పరమేశ్వర్ తుమకూరు జిల్లాల్లోని కోరగెరె నియోజక వర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శుక్రవారం కోరటగెరె తాలుకాలోని బైరనహళ్లి లో డాక్టర్ జీ. పరమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ఆసమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ పరమేశ్వర్ తో పాటు ఆయన వెంట వెలుతున్న వారి మీద రాళ్ల వర్షం కురిపించారు. ఈ రాళ్ల దాడిలో పరమేశ్వర్ తలకు గాయాలైనాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాయలు అయ్యాయి. వెంటనే పరమేశ్వర్ కు కోరటగెరెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు.
తలకు తీవ్రగాయాలు కావడంతో పరమేశ్వర్ ను తుమకూరులోని సిద్దార్థ్ మెడికల్ కాలేజ్ కు తరలించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మీద రాళ్ల దాడి జరగడం, ఈ దాడిలో ఆయనకు గాయాలు కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ పరమేశ్వర్ ఏప్రిల్ 19వ తేదీన నామినేషన్ వేసిన సందర్బంలో కోరగెరె తాలుకా పంచాయితీ కార్యాలయం మీద రాళ్ల దాడి జరిగింది. ఆ సందర్బంలో డాక్టర్ పరమేశ్వర్ నామినేషన్ వెయ్యడానికి ప్రభుత్వ కార్యాలయంలో ఉండటంతో ఆయన దాడి నుంచి తప్పించుకున్నారు.
అయితే ఇప్పుడు నేరుగా పరమేశ్వర్ మీద రాళ్ల దాడి జరగడం ఆ ప్రాంతంలో కలకలకం రేపింది. మాజీ ఉప ముఖ్యమంత్రికే రక్షణ లేకుండాపోయిందని, పక్కాప్లాన్ ప్రకారమే ప్రత్యర్థి పార్టీ నాయకులు రాళ్ల దాడులు చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ ఆరోపించారు. అయితే రాళ్ల దాడి చేసింది బీజేపీ కార్యకర్తలా, జేడీఎస్ కార్యకర్తలా అనే విషయంలో క్లారిటీలేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications