నిన్న ప్రధానితో వినయంగా కేజీఎఫ్ హీరో, ఇప్పుడు మాత్రం నో అంటున్న యష్, కాంతార సేమ్!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ హీరోలు, సినిమా నటీనటులతో ప్రచారం చేయించి లాభం పొందాలని పలు పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తరపున ప్రచారం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు కేజీఎఫ్ హీరో యష్, కాంతార హీరో రిషబ్ శెట్టి వంతు వచ్చింది.
ఇటీవల బెంగళూరలోని ఓ ప్రైవేట్ హోటల్ లో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో కలిసి మీడియాతో మాట్లాడిన కన్నడ స్టార్ హీరో. బహుబాష నటుడు. దర్శకుడు కిచ్చా సుదీప్ తాను బీజేపీలో చేరడంలేదని, అయితే సీఎం బోమ్మయ్ తో పాటు ఆయన సూచించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపుప ప్రచారం చేస్తానని అన్నారు.

తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని, తనకు అన్ని పార్టీల్లోని రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కిచ్చా సుదీప్ అన్నారు. అయితే ఇదే సమయంలో కిచ్చా సుదీప్ తో పాటు మరో స్టార్ హీరో చాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినా ఆ విషయంలో ఇంత వరకు క్లారిటీ లేదు.
కొంతకాలం క్రితం బెంగళూరు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కేజీఎఫ్ హీరో యష్, కాంతార సినిమా హీరో, అదే సినిమా దర్శకుడు అయిన రిషబ్ శెట్టి, స్యాండిల్ వుడ్ పవర్ స్టార్, దివంగత డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ తో పాటు పలువురు క్రీడాకారులకు బెంగళూరులోని రాజ్ భవన్ లో విందు ఇచ్చారు. కొన్ని నెలల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో వీరందరూ కలిశారు.

దయచేసి నన్ను వదిలేయండి: కిచ్చా సుదీప్ తో పాటు మీరు బీజేపీ తరపున ప్రచారం చెయ్యాలని కొందరు బీజేపీ నాయకులు కేజీఎఫ్ హీరో యష్, కాంతార హీరో రిషబ్ శెట్టిని కలిసి మనవి చేశారని తెలిసింది. అయితే తాను రాజకీయాలకు దూరం, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకూడదని, తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని కేజీఎఫ్ హీరో యష్ తేల్చి చెప్పాడని సమాచారం.
సుమలతకు జోరుగా ప్రచారం చేసిన యష్: గత లోక్ సభ ఎన్నికల సమయంలో మండ్య నుంచి పోటీ చేసిన బహుబాష నటి, తెలుగింటి ఆడపడుచు దివంగత రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి సుమలతను గెలిపించాలని చాలా రోజుల పాటు హీరో యష్ ప్రచారం చేశారు. అయితే ఇటీవల ప్రధాని మోదీని స్వయంగా కలిసిన కేజీఎఫ్ హీరో యష్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ తరపున ప్రచారం చెయ్యడానికి వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. మొత్తం మీద కర్ణాటకలో స్టార్ హీరోలతో ప్రచారం చేయించుకోవాలని పలువురు రాజకీయ నాయకులు ఉబలాటపడుతున్నారని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications