Hijab: రగులుతున్న కర్ణాటక: పొరుగు జిల్లాలకు పాకిన అల్లర్లు: రాళ్లు రువ్విన ఆందోళనకారులు
బెంగళూరు: కర్ణాటకలో హిజబ్ వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతూనే ఉంది. తొలుత ఉడుపి, కోలార్ జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందళనలు..ఉద్రిక్తతలు మరింత విస్తరించాయి. కర్ణాటక ఉత్తర ప్రాంతానికీ పాకాయి. తాజాగా బాగల్‌కోటె జిల్లాలో ఆందోళనకారులు రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది. హిజబ్ వివాదంలో ఇప్పటిదాకా రాళ్లు రువ్వుకున్న సంఘటనలు చోటు చేసుకోలేదు. తాజాగా- ఈ వివాదం మరింత ముదిరినట్టే కనిపిస్తోంది.
కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని బాగల్‌కోటె జిల్లాలో గల రబకవి బనహట్టిలోని ప్రీ-యూనివర్శిటీ కళాశాల వద్ద ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజబ్‌ను ధరించిన పలువురు విద్యార్థినులు కళాశాల ఎదురుగా నిరసన ప్రదర్శనలకు దిగారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించారు.
అదే సమయంలో మరికొందరు విద్యార్థులు మెడలో కాషాయ కండువా వేసుకుని తరగతులకు హాజరయ్యారు. హిజబ్ ధరించిన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కాషాయ కండువాను ధరించిన విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది మరింత ముదిరింది. నిరసన ప్రదర్శనలు చేస్తోన్న వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీనితో బనహట్టిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టారు. పరిస్థితి చేయి దాటకముందే అదుపు చేశారు. బనహట్టిలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ వివాదాన్ని శాంతియుంతంగా పరిష్కరించడానికి జిల్లా పాలన యంత్రాంగం ప్రయత్నిస్తోందని అన్నారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేశారు.
Recommended Video
అటు శివమొగ్గ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని పలు కళాశాలల్లో హిజబ్, కాషాయ కండువాల వివాదం తీవ్రంగా కనిపించింది. సహ్యాద్రి కళాశాల, ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ విద్యాసంస్థల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యార్థులు పరస్పరం రాళ్లు సైతం రువ్వుకున్నారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీఛార్జీ చేసి, వారిని చెదరగొట్టారు. కాషాయ కండువాలను ధరించిన విద్యార్థులు శివమొగ్గలోని బీహెచ్ రోడ్‌లో భారీ ర్యాలీని నిర్వహించారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు.












Click it and Unblock the Notifications