బెంగళూరులోవర్షబీభత్సం; బోట్లతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు!!
బెంగళూరు నగరం గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలతో కూడిన వరద పరిస్థితుల మధ్య నగరంలోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. వరదల కారణంగా కాలనీలు నీతమునగటంతో పలువురు నీటిలో చిక్కుకుపోయారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం కోసం బోట్లను రంగంలోకి దింపిన అధికారులు
బోట్ల సహాయంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులోని వర్తూరు శివారులో వరదల కారణంగా బోట్ లను రంగంలోకి దింపారు. ఐటీ హబ్ ఏరియా ముంపుకు గురైంది. బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్ మరియు బీఈఎంఎల్ లేఅవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా భారీ వర్షాల కారణంగా ప్రభావితమయ్యాయి. ప్రజలు వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల దృశ్యాలను ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు. భారీగా నీరు చేరటంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి చోటు చేసుకుంది. రోడ్లపై వాహనాలు నీళ్ళలో కొట్టుకుపోతున్న దృశ్యాలు వరద ఉధృతికి అద్దం పడుతున్నాయి.
సెప్టెంబర్ 9 వరకు కర్ణాటకలో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక
భారీ వర్షాల కారణంగా రోడ్లపైకి నీరు చేరుకోవడంతో బెంగళూరు శివార్లలో ఉన్న టెక్ పార్కులకు నగరాన్ని కలుపుతున్న ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ప్రభావితమైంది. ఎకో స్పేస్ సమీపంలోని ఓ ఆర్ ఆర్ పైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇదిలావుండగా, భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబర్ 9 వరకు కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బెంగళూరు, కోస్తా కర్ణాటకలోని మూడు జిల్లాలు మరియు రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ జిల్లాలలో సెప్టెంబర్ 9 వరకు ఎల్లో వార్నింగ్
ఇక అలాగే కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు జిల్లాలకు సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. ప్రమాదకరమైన, వేగవంతమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఉత్తరాది జిల్లాలైన బీదర్, కలబురగి, విజయపుర, గడగ్, ధార్వాడ్, హవేరి, దావణగెరెలలో రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

భారీవర్షాలతో అతలాకుతలం అవుతున్న బెంగళూరు నగరం
రాజధాని నగరం గత వారం రోజులుగా భారీ వర్షాలను ఎదుర్కొంటున్న పరిస్థితిలో బెంగుళూరు నగరం అతలాకుతలమవుతోంది. బెంగళూరు అంతటా వేలాది ఇళ్లు ముంపునకు గురయ్యాయని అధికారులు వెల్లడించారు. వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications