అమెరికా కోర్టులో సెక్యూరిటీల మోసం కేసును కొట్టివేయాలంటూ అదానీ పిటిషన్
బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ తమపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దాఖలు చేసిన సెక్యూరిటీస్ మోసం కేసును కొట్టివేయాలని అమెరికా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు అమెరికా అధికార పరిధిలోకి రాదని, అందులో అర్హత లేదని వారి వాదన.
నవంబర్ 2024లో, భారత ప్రభుత్వ అధికారులతో కూడిన లంచం పథకాన్ని వెల్లడించకుండా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ SEC అదానీలపై చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ 30న దాఖలు చేయనున్న ప్రీ-మోషన్ లేఖలో, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ జారీ చేసిన 2021 బాండ్లకు సంబంధించిన SEC ఆరోపణలు చట్టబద్ధంగా లోపభూయిష్టమని అదానీలు పేర్కొన్నారు.

వారి వాదనల ప్రకారం, గౌతమ్, సాగర్‌లకు అమెరికాతో తగినంత సంబంధాలు లేవు, బాండ్ జారీ ప్రక్రియలో ప్రత్యక్ష ప్రమేయం లేదు. అందువల్ల, అమెరికా కోర్టుకు వ్యక్తిగత అధికార పరిధి లేదని వారు తేల్చి చెప్పారు.దాఖలు చేసిన పత్రాల ద్వారా, 750 మిలియన్ డాలర్ల బాండ్ల విక్రయం రూల్ 144A, రెగ్యులేషన్ S మినహాయింపులతో అమెరికా వెలుపల జరిగింది. ఈ సెక్యూరిటీలు మొదట అమెరికా యేతర అండర్ రైటర్లకు, తర్వాత అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు పాక్షికంగా విక్రయించబడ్డాయి.
గౌతమ్ అదానీ బాండ్ల జారీని ఆమోదించారని, కీలక సమావేశాలకు హాజరయ్యారని లేదా అమెరికా పెట్టుబడిదారుల లక్ష్యంగా కార్యకలాపాలు నిర్దేశించారని ఫిర్యాదులో పేర్కొనబడలేదని న్యాయవాదులు తెలిపారు.SEC కేసు అమెరికా వెలుపలి అధికార పరిధి (extraterritorial)కి సంబంధించినదిగా పిటిషన్‌లో వివరించారు. సెక్యూరిటీలు అమెరికాలో లిస్ట్ కాలేదు, జారీ చేసిన కంపెనీ భారతదేశంలో ఉంది.
అమెరికా సుప్రీంకోర్టు పూర్వ తీర్పులను ఉటంకిస్తూ, అమెరికా సెక్యూరిటీల చట్టాలకు కీలకమైన "దేశీయ లావాదేవీని" SEC నిరూపించలేకపోయిందని ప్రతివాదులు వాదించారు.అంతేకాకుండా, 2024లో బాండ్లు మెచ్యూరీటీ అయ్యాయని, వడ్డీతో సహా పూర్తిగా తిరిగి చెల్లించబడ్డాయని చెబుతూ, పెట్టుబడిదారులకు ఎటువంటి నష్టాలు జరిగాయని SEC ఆరోపణలు చేయలేదని అదానీలు పేర్కొన్నారు. ఈ లంచం ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలు లేవని తిరస్కరించారు.
ESG కట్టుబాట్లు, అవినీతి నిరోధక చర్యలు, కార్పొరేట్ ప్రతిష్టపై SEC పేర్కొన్న ప్రకటనలు "పఫ్ఫరీ" అని, అంటే పెట్టుబడిదారులు సహేతుకంగా ఆధారపడలేని సాధారణ కార్పొరేట్ ఆశావాదమని పిటిషన్‌లో వాదించారు. నిర్దిష్ట తప్పుదారి పట్టించే ప్రకటనలతో తమను ముడిపెట్టడంలో లేదా మోసం చేయాలనే ఉద్దేశాన్ని స్థాపించడంలో SEC విఫలమైందని ప్రతివాదులు తెలిపారు.ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని అదానీలు కోరుతున్నారు. అవసరమైతే ప్రీ-మోషన్ సమావేశానికి హాజరు కావడానికి తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు.












Click it and Unblock the Notifications