బంగారం, వెండి ధరల రిస్క్-వాళ్లను ఆదుకోండి-కేంద్రాన్ని కోరిన సాయిరెడ్డి..!
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొంటున్న పరిణామాలతో మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. దీని ప్రభావంతో విలువైన లోహాలుగా పేరుగాంచిన బంగారం, వెండి వాటి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వారం ఆకాశానికి పెరుగుతున్న ఈ లోహాల ధరలు.. మరోవారం పాతాళానికి పతనం అవుతున్నాయి. దీంతో ఈ రెండు లోహాల్లో పెట్టుబడులు పెట్టాలంటే కూడా జనం భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం రేపు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది.
బంగారం, వెండి హెచ్చుతగ్గులపై సాయిరెడ్డి
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు, అనిశ్చితి విషయంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ఓ ట్వీట్ చేశారు. ఇందులో సాయిరెడ్డి.. బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దీర్ధకాలంగా వీటిని నమ్ముకుని ఉన్న పొదుపుదారుల్ని (పెట్టుబడిదారుల్ని) రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఆదుకోవాలంటూ కీలక విజ్ఞప్తి చేశారు.

ఎల్టీసీజీ మినహాయింపు పరిమితి పెంపు
బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను, ముఖ్యంగా బంగారంపై నమ్మకమైన విలువ నిల్వగా ఆధారపడే మధ్యతరగతి కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తున్నాయని సాయిరెడ్డి తన ట్వీట్ లో తెలిపారు. అలాగే ఈ అస్థిరతలో, మనం ఓపికగా, దీర్ఘకాలికంగా పొదువు చేస్తున్న వారికి ప్రతిఫలమివ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఇందుకోసం LTCG మినహాయింపు పరిమితిని ₹1.25 లక్షల నుండి ₹2 లక్షలకు పెంచాలని కోరారు. తద్వారా బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి వీరికి ఊరట కల్పించవచ్చని సూచించారు.

ఏంటీ ఎల్టీసీజీ మినహాయింపు ?
భారతీయ పన్ను చెల్లింపుదారులకు, లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు, వ్యాపార ట్రస్టుల యూనిట్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల కోసం ప్రస్తుత మినహాయింపు (పన్ను రహిత) పరిమితి సెక్షన్ 112A కింద ఆర్థిక సంవత్సరానికి ₹1.25 లక్షలుగా ఉంది. ఈక్విటీ ఆస్తుల నుండి ₹1.25 లక్షలకు పైగా ఉన్న ఏదైనా LTCG 12.5% (వర్తించే విధంగా సర్‌ఛార్జ్ మరియు సెస్‌తో పాటు) పన్ను విధిస్తారు. ఈ గరిష్ట పరిమితి ₹1.25 లక్షలు (గతంలో ₹1 లక్ష) 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి వర్తింపజేశారు. ఇప్పుడు దాన్ని 2 లక్షలకు పెంచాలని సాయిరెడ్డి కోరుతున్నారు.












Click it and Unblock the Notifications