కారు కొనేవారికి బిగ్ న్యూస్.. 2027 నుంచి కొత్త రూల్స్.. ధరలు పెరుగుతాయా?
కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా మైలేజ్, బడ్జెట్, ఫీచర్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే భవిష్యత్తులో కార్ల కొనుగోలు ఖర్చు పెరగనున్నప్పటికీ.. పెట్రోల్ ఖర్చులు తగ్గి వినియోగదారుల జేబుకు ఉపశమనం లభించనుంది. ఇండియాలో అమ్ముడయ్యే కార్ల సగటు ఫ్యూయల్ ఎఫిషియెన్సీ పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 'కాఫే III' (CAFE III-Corporate Average Fuel Economy) నిబంధనలను తీసుకువస్తోంది. ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త నిబంధనలు ఆటోమొబైల్ రంగాన్ని, వాహన తయారీ సంస్థల వ్యూహాలను గణనీయంగా మార్చబోతున్నాయి.
ఏంటీ ఈ 'కాఫే III' నిబంధనలు?
కాఫే మూడో విడత నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి ప్రారంభమై మార్చి 31, 2032 వరకు అమలులో ఉంటాయి. ఈ ఐదేళ్ల కాలంలో వాహన తయారీ కంపెనీలు తమ ప్యాసింజర్ వాహనాల సగటు ఇంధన వినియోగాన్ని క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. 2027-28 ఆర్థిక సంవత్సరంలో ప్రతి 100 కిలోమీటర్లకు 3.996 లీటర్ల సగటు ఇంధన వినియోగాన్ని లక్ష్యంగా నిర్ణయించగా.. 2031-32 నాటికి దానిని 3.3273 లీటర్లకు తగ్గించాల్సి ఉంటుంది. అంటే రాబోయే ఐదేళ్లలో ఇంధన పొదుపు ప్రమాణాల్లో దాదాపు 16.7 శాతం పురోగతి సాధించాల్సి ఉంటుంది. దీని కోసం కంపెనీలు పెట్రోల్ ఇంజిన్ల టెక్నాలజీని మెరుగుపరచడంతో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు తయారీపై ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది.

ఫోర్ట్ ఫోలియో సగటు ఆధారంగా ఇంధన లక్ష్యాలు
ఈ నిబంధనల్లోని ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. ప్రతి ఒక్క కారు మోడల్ కు విడివిడిగా మైలేజ్ లక్ష్యాన్ని నిర్దేశించరు. ఓ కంపెనీ దేశంలో విక్రయించే మొత్తం ప్యాసింజర్ వాహనాల సగటు ఇంధన వినియోగం ప్రాతిపదికన ఈ ప్రమాణాలను లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ కంపెనీకి చెందిన నిర్దిష్ట మోడల్ తక్కువ మైలేజ్ ఇచ్చినప్పటికీ.. ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన ఇతర కార్లు లేదా ఎలక్ట్రిక్ వాహనాలు ఆ పోర్ట్‌ఫోలియో సగటును సమతుల్యం చేయడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల కంపెనీలు తమ ఇంజిన్ ఆప్షన్లు, పెట్టుబడులను సరికొత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది.
కార్ల ధరలు పెరుగుతాయా?
కొత్త సవాళ్లను అందుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు మరింత సమర్థవంతమైన ఇంజిన్లు, హైబ్రిడ్ సిస్టమ్స్, కొత్త ఇంజనీరింగ్ డిజైన్లపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. తయారీ వ్యయం పెరగడం వల్ల కొన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 1, 2027 నుంచి అన్ని కార్ల ధరలు ఒకేసారి పెరుగుతాయని చెప్పలేం. కంపెనీలు ఉపయోగించే సాంకేతికత, ఆయా మోడళ్ల స్వభావాన్ని బట్టి వ్యయంలో మార్పులు ఉంటాయి.
వినియోగదారులకు లభించే ప్రయోజనాలు
ధరలు కొంతవరకు పెరిగినప్పటికీ.. సుదీర్ఘ కాలంలో వినియోగదారులకు మైలేజ్ రూపంలో భారీగా ఆదా కానుంది. ఇంధన సామర్థ్యం కలిగిన కార్లు అందుబాటులోకి రావడం వల్ల నిత్యం అయ్యే పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కారు కొనేటప్పుడు కేవలం ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే కాకుండా నిర్వహణ వ్యయం కూడా కీలక అంశంగా మారనుంది. మొత్తం మీద భారత ఆటోమొబైల్ రంగంలో పర్యావరణహిత, అధిక మైలేజ్ ఇచ్చే వాహనాల వినియోగాన్ని పెంచడంలో 'కాఫే III' నిబంధనలు ఓ విప్లవాత్మక మార్పుగా నిలవనున్నాయి.














Click it and Unblock the Notifications
