రిజర్వేషన్లతో మారిన జనసేన సీట్ల లెక్కలు - తేల్చేసిన చంద్రబాబు, పవన్ వద్దకు పల్లా..!!
స్థానిక ఎన్నికల వేళ కూటమి సీట్ల సర్దుబాటు పై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలకు సీట్ల కేటాయింపు పై అవగాహనకు వచ్చారు. రిజర్వేషన్లు ప్రకటనతో జనసేన సమీకరణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇదే అంశం పైన సీఎం చంద్రబాబుతోనూ చర్చ చేయగా.. ఆయన తన వైఖరి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీట్ల వ్యవహారం పై పవన్ వద్దకు టీడీపీ నేతలు వెళ్తున్నారు. ఈ సాయంత్రం అధికారికంగా కూటమి సీట్ల వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్లు.. సర్దుబాటు వ్యవహారం పైన తుది చర్చలు కొనసాగుతు న్నాయి. సీట్ల సర్దుబాటుపై సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం జరిగింది. జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్... బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో తమకు కేటాయించిన సీట్ల శాతంతో సంబంధం లేకుండా... తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేద్దామన్నది తమ ఆలోచన అని, దానికి అనుగుణంగా సీట్లు కేటాయించాలని జనసేన, బీజేపీ కోరినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు రిజర్వేషన్లను ప్రకటించడంతో తాము ముందుగా అనుకున్న సమీకరణాల్లో మార్పులు వచ్చాయని జనసేన, బీజేపీ నేతలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. హడావిడి గా రిజర్వేషన్లు ప్రకటించడంపైనా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. వాటిని మార్పు చేసేందుకు ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలించాలని కోరినట్లు తెలుస్తోంది.

నేడు కూటమి నేతల కీలక చర్చలు
కాగా, దీనిపై సీఎం స్పందిస్తూ.. రిజర్వేషన్ల ప్రకటనపై తమ పార్టీలోనూ అసంతృప్తి ఉన్నప్పటికీ చట్టబద్ధంగా జరగాల్సిన ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని, రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారని సమాచారం. తాము ముందుగా అనుకున్న స్థానాలు రిజర్వేషన్ల కారణంగా తారుమారు అయ్యాయ ని... కొత్త స్థానాల ఎంపిక, అక్కడ అభ్యర్థులు ఎవరన్న దానిపై తమ పార్టీల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని జనసేన, బీజేపీ కోరడంతో ఈ రోజు (మంగళవారం) మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో, ఈ రోజు జనసేన కార్యాలయానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. అక్కడ జనసేనాని పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించారు. ఆ తరువాత మరోసారి కూటమి నేతలంతా సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రానున్నారు.












Click it and Unblock the Notifications
