శ్రీవారి భక్తుల కోసం కొత్త యాప్ - వెయిటింగ్ కష్టాలకు చెక్, ఇక పూర్తిగా..!!
తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల తో పాటుగా సెలవులు కావటంతో రద్దీ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో భక్తులకు మరింత సేవలు సులభతరం చేసేందుకు కొత్త యాప్ అందుబాటు లోకి వచ్చింది. భక్తులకు పూర్తి సమాచారం ఏఐ ఆధారిత సేవలు అందించనుంది.
టీటీడీ భక్తుల కోసం మరో కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబు టీటీడీ భక్తుల సౌకర్యార్థం రూపొందించిన 'వేంకటాద్రి' మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ ప్రాంతాలను సులభంగా గుర్తించడంతోపాటు అవసరమైన సౌకర్యాలను త్వరగా చేరుకునేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. ఇందులో 24 గంటల పాటు సేవలందించే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాయిస్ అసిస్టెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వాయిస్ కమాండ్ల ద్వారా తాగునీటి కేంద్రాలు, దర్శన ప్రవేశ ద్వారాలు తదితర ప్రదేశాలను భక్తులు సులభంగా గుర్తించవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉన్నా, పూర్తిగా అందుబాటులో లేకపోయినా ఉపయోగించుకునేలా ఆఫ్‌లైన్ నావిగేషన్ సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించారు. ఈ యాప్‌లో 25 విభాగాలకు సంబంధించి 350కు పైగా ప్రదేశాల వివరాలను పొందుపరిచారు. 'వేంకటాద్రి' యాప్‌ను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందించారు.

భక్తుల కోసం పూర్తి సమాచారంతో
అందులో భాగంగా తాగునీటి కేంద్రాలు, ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, పార్కింగ్ ప్రదేశాలు, మరుగుదొడ్లు, బస్ స్టాప్‌లు, దర్శన ప్రవేశ ద్వారాలు, లగేజీ కేంద్రాలు, ఉచిత పాదరక్షల డిపాజిట్ కేంద్రాలు, అన్న ప్రసాద కేంద్రాలు, ఆహార విక్రయ కేంద్రాలు, క్యాంటీన్లు, గది కేటాయింపు కౌంటర్లు, భక్తుల సహాయ కేంద్రాలు, టీటీడీ కార్యాలయాలు, ఉప విచారణ కార్యాలయాలు, కల్యాణకట్టలు, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు, ఆలయ పరిసరాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయం తదితర సదుపాయాల వివరాలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంప్రదించేందుకు అత్యవసర ఫోన్ నంబర్లు, పోలీస్ సేవలు, టీటీడీ హెల్ప్‌లైన్ వివరాలను యాప్‌లో పొందుపరిచారు. బస్సు మార్గాలు, సమయాలను కూడా తెలుసుకోవచ్చు. 'మార్క్ మై స్పాట్' సదుపాయం ద్వారా భక్తులు తాము పార్కింగ్ చేసిన ప్రదేశాన్ని లేదా ఇతర ముఖ్యమైన ప్రాంతాన్ని గుర్తుగా సేవ్ చేసుకుని, తిరిగి ఆ ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
