Old Monk Rum: సేల్స్ బంద్, 500 కోట్ల రూపాయల భారీ నష్టం.
దేశవ్యాప్తంగా ఎంతోమంది యువకులు, మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ లిక్కర్ బ్రాండ్‌గా పేరుగాంచిన 'ఓల్డ్ మాంక్' (Old Monk) చుట్టూ వివాదాల మేఘాలు అలుముకున్నాయి. మహారాష్ట్రలో ఈ రమ్ము అమ్మకాలపై విధించిన నిషేధం కారణంగా తయారీ సంస్థకు ఏకంగా రూ. 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కంపెనీ వర్గాలు బాంబే హైకోర్టుకు వెల్లడించాయి. బాటిల్పై ముద్రించే లేబుల్‌లో 'రమ్' బదులుగా 'రమ్ లాంటిది' (rum-like) అని మార్చాల్సిందేనని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పట్టుబడుతుండటంతో ఈ వివాదం ముదిరింది.
ఓల్డ్ మాంక్ బ్రాండ్ తయారీ సంస్థ 'మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ ప్రైవేట్ లిమిటెడ్' తరఫున సీనియర్ అడ్వొకేట్ వెంకటేష్ ధోండ్ సోమవారం బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న తమ తయారీ యూనిట్ నుంచి అమ్మకాలు నిలిచిపోవడం వల్ల కంపెనీకి రూ. 500 కోట్లకు పైగా కార్పొరేట్ నష్టం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు.

కేవలం కంపెనీకే కాకుండా, దీనివల్ల ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు దాదాపు రూ. 350 కోట్ల రెవెన్యూ నష్టం జరిగిందని, దాదాపు 300 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ యథావిధిగా అమ్ముడవుతున్నప్పటికీ, ఒక్క మహారాష్ట్రలోనే విక్రయాలను నిలిపివేయడం గమసార్హం.
లేబుల్ మార్పుపైనే ముడి.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కఠిన వైఖరి
ఈ వివాదంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ స్పందిస్తూ.. తయారీదారులు ప్రొడక్ట్ లేబుల్‌ను 'రమ్' నుంచి 'రమ్-లాంటిది' గా మారుస్తామని అంగీకరిస్తేనే అమ్మకాలకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు. యాడెడ్ రమ్ ఫ్లేవర్‌లను కలపడం వల్ల అసలు రమ్ టేస్ట్ కస్టమర్లను గందరగోళానికి గురిచేసే అవకాశం ఉందని, అందుకే దానిని ఫ్లేవర్డ్ స్పిరిట్‌గా స్పష్టంగా లేబుల్ చేయాలని రెగ్యులేటర్ వాదిస్తోంది. అంతేకాకుండా, ఓల్డ్ మాంక్ బాటిళ్లపై ఉన్న '7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్', 'వెరీ ఓల్డ్ వ్యాట్టెడ్' వంటి వయస్సు సంబంధిత వివరణలపై కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది.
వివాదం పరిష్కారానికి విఫలయత్నాలు.. అక్టోబర్ 23కి విచారణ వాయిదా
ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ తయారీ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో భాగంగా.. కాంట్రవర్సియల్ ఇయర్స్ వివరాలను తొలగించి, 'అదనపు ఫ్లేవర్ జోడించబడినట్లు' ప్రముఖంగా కనిపించేలా సవరించిన లేబుల్ డ్రాఫ్ట్‌లను సమర్ధిస్తామని కంపెనీ ముందుకు వచ్చింది. అయితే రెగ్యులేటర్ ఈ సవరించిన లేబుళ్లను ఆమోదించకపోవడంతో ఇరువర్గాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రధాన జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నా లతో కూడిన ధర్మాసనం ముందుంచగా.. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 23న తుది విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
