రూ. 6.30 లక్షల ధర.. 35కిలోమీటర్ల మైలేజ్: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఫ్యామిలీ కార్!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు క్రేజ్ పెరుగుతున్నప్పటికీ.. సెడాన్ కార్లకు ఉన్న ఆదరణ తగ్గలేదు. ఇటీవల విడుదలైన లెక్కల ప్రకారం గత సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 35,119 సెడాన్ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 33,346 యూనిట్లతో పోలిస్తే ఇది 5.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాంపాక్ట్ సెడాన్ విభాగానికి మంచి డిమాండ్ లభించగా.. కొన్ని మోడళ్లు అమ్మకాలలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
సెడాన్ విభాగంలో మార్కెట్ వాటా పరంగా మారుతి సుజుకి డిజైర్ అగ్రస్థానంలో నిలవగా.. హ్యుందాయ్ ఆరా అమ్మకాలలో ఊహించని వృద్ధిని సాధించింది. టాటా నుంచి కొత్తగా వచ్చిన ఏరిస్ కూడా టాప్-4లో చోటు దక్కించుకుంది. అయితే ఫోక్స్‌వాగన్ వర్టస్ వంటి కొన్ని కార్ల అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్-6 సెడాన్ కార్ల వివరాలు ఇవే.
1.మారుతి సుజుకి డిజైర్:
సెడాన్ కార్ల విభాగానికి రాణిగా వెలుగొందుతున్న డిజైర్ సెప్టెంబర్ నెలలో ఏకంగా 17,754 యూనిట్ల విక్రయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. దేశీయ సెడాన్ మార్కెట్లో దాదాపు 50.6 శాతం వాటాను ఇది ఒక్కటే కైవసం చేసుకుంది. రూ.6.30 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది పెట్రోల్ వెర్షన్‌లో లీటరుకు 25 కిలోమీటర్లు, సీఎన్‌జీ వెర్షన్‌లో కేజీకి 35 కిలోమీటర్ల అత్యధిక మైలేజ్‌ను అందిస్తుంది.

2. హ్యుందాయ్ ఆరా
రూ.6 లక్షల ప్రారంభ ధర కలిగిన హ్యుందాయ్ ఆరా 7,530 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే దీని విక్రయాలు 39.8 శాతం పెరిగాయి. 21.4 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నఈ కారులో 1.2-లీటర్ ఇంజిన్, 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇది పెట్రోల్ పై 16 కిలోమీటర్లు, సీఎన్జీపై 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
3.హోండా అమేజ్
రూ.7.65 లక్షల ధరకు లభించే హోండా అమేజ్ 3,286 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. 25.9 శాతం వార్షిక వృద్ధితో 9.4 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది లీటరుకు 17 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
4. టాటా ఏరిస్
ఇటీవల విపణలోకి ప్రవేశించిన టాటా ఏరిస్ రూ.5.30 లక్షల ధరతో ప్రారంభమై.. సెప్టెంబర్ లో 2,406 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. 1.2 లీటర్ ఇంజిన్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లతో వస్తున్న ఈ కారు పెట్రోల్‌పై 19 కిలోమీటర్లు, సీఎన్జీపై 26 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
5,6. ఫోక్స్‌వాగన్ వర్టస్, హ్యుందాయ్ వర్నా: ఫోక్స్‌వాగన్ వర్టస్(రూ.10.71 లక్షలు), 1,172 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలవగా.. అమ్మకాలలో 28.9 శాతం క్షీణతను నమోదు చేసింది. చివరిగా హ్యుందాయ్ వర్నా(రూ.10.99 లక్షలు) 762 యూనిట్ల విక్రయాలతో ఆరో స్థానంలో నిలిచింది. ఈ రెండు మోడళ్లు లీటరుకు దాదాపు 17 నుంచి 18 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయి.














Click it and Unblock the Notifications
