దీపావళికి ముందు ఉద్యోగులకు గుడ్‌న్యూస్
EPFO: ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రాకు సంబంధించిన రూల్స్ ను సులభతరం చేసింది. పాక్షిక ఉపసంహరణ (Partial Withdrawal) కోసం గతంలో ఉన్న 13 సంక్లిష్టమైన నిబంధనలను తొలగించి, ఉద్యోగుల సౌలభ్యం కోసం కేవలం మూడు కేటగిరీలలో పార్షియల్ విత్‌డ్రాల్ నిబంధనలను ఈపీఎఫ్‌వో రూపొందించింది. ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారులు ఉద్యోగి, యజమాని వాటా సహా పీఎఫ్ ఖాతాలోని నిధుల్లో 100 శాతం విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
దీపావళి పండుగకు ముందు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సోమవారం జరిగిన సమావేశంలో కీలకమైన, చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
*ఉపసంహరణ నిబంధనలను సరళీకృతం చేయడం.
*వ్యాజ్యాలను (Litigations) తగ్గించడానికి 'విశ్వాస్ యోజన' ప్రారంభించడం.
*EPFO 3.0 కింద డిజిటల్ మార్పుల ప్రణాళికను ఆమోదించడం జరిగింది.
కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తారు. ఇందులో ఉద్యోగి, యజమాని ఇద్దరి వాటా కూడా ఉంటుంది.

ఉపసంహరణ నిబంధనలు సులభతరం: మూడు కేటగిరీలే
పాక్షిక ఉపసంహరణ కోసం గతంలో అమలులో ఉన్న 13 కఠినమైన నిబంధనలను రద్దు చేయడంతో, ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా డబ్బును విత్‌డ్రా చేసుకోవడం మరింత సులభమైంది. కొత్తగా రూపొందించిన మూడు కేటగిరీలు ఇవే:
*ముఖ్యమైన అవసరాలు: అనారోగ్యం, విద్య, వివాహం.
*గృహ అవసరాలు: ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం.
*ప్రత్యేక పరిస్థితులు: దీని కింద డబ్బు విత్‌డ్రా చేయడానికి ఇకపై ఎటువంటి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ప్రత్యేక పరిస్థితులు ఆప్షన్ కింద పాక్షిక విత్ డ్రాకు నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, కంపెనీల మూసివేత వంటి కారణాలు మాత్రమే చూపాల్సి ఉండేది.
విద్యా, వివాహ ఉపసంహరణ పరిమితి పెంపు
కొత్త నిబంధనల ప్రకారం ఉపసంహరణ పరిమితులు పెంచబడ్డాయి:
*విద్య: గతంలో ఉన్న పరిమితి కంటే 10 సార్లు వరకు పాక్షిక ఉపసంహరణకు అనుమతి లభించింది. అంటే పిల్లల చదువు కోసం 10 సార్లు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు.
వివాహం: 5 సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలోని రూల్స్ ప్రకారం.. 3 సార్ల వరకే లిమిట్ ఉంటుంది.
కనీస సర్వీస్: అన్ని రకాల పాక్షిక ఉపసంహరణల కోసం కనీస సర్వీస్ అవసరాన్ని 12 నెలలకు తగ్గించారు.
ఈపీఎఫ్వో ప్రయోజనాల కోసం 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరి
ఉద్యోగులు మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించినప్పటికీ ఈపీఎఫ్వో ఓ ముఖ్యమైన షరతును విధించింది. సభ్యులు తమ ఖాతాలో కనీసం మొత్తం సహకారంలో 25 శాతం బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఈ నిబంధన వల్ల ఉద్యోగులకు ఈపీఎఫ్వో అందించే 8.25% అధిక వార్షిక వడ్డీ రేటు, చక్రవడ్డీ ప్రయోజనం నిరంతరంగా లభిస్తుంది.
వ్యాజ్యాల పరిష్కారానికి 'విశ్వాస్ యోజన'
పీఎఫ్ చెల్లింపులలో ఆలస్యంపై విధించే దండనపరమైన నష్టాలకు (Penal Damages) సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సుదీర్ఘ వ్యాజ్యాలను పరిష్కరించేందుకు విశ్వాస్ యోజనను CBT ఆమోదించింది. మే 2025 నాటికి రూ.2,406 కోట్ల దండనపరమైన నష్టాలు, 6,000 పైగా కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ పథకం కింద:
పీఎఫ్ ఆలస్యంగా జమ చేసినందుకు జరిమానా రేటును నెలకు ఒక శాతానికి తగ్గించారు. రెండు నెలల వరకు ఆలస్యం అయితే 0.25 శాతం, నాలుగు నెలల వరకు అయితే 0.50శాతం జరిమానా ఉంటుంది. ఈ పథకం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలలు పొడిగించవచ్చు.












Click it and Unblock the Notifications