చెరకు, మొక్కజొన్న అక్కర్లేదు.. జుట్టు నుంచే ఇథనాల్.. గుజరాత్ స్టార్టప్ సంచలనం!
ఇప్పటివరకు చెరకు మొక్కజొన్న, ఇతర ధాన్యాల వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం అనేది అందరికి తెలిసిందే. అయితే రోజూ కత్తిరించి చెత్తబుట్టలో పడేసే మానవ జుట్టు నుంచి కూడా ఇథనాల్ తయారు చేయవచ్చని గుజరాత్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. పెట్రోల్‌లో కలపడానికి ఇండియాకు రోజురోజుకు ఇథనాల్ అవసరం పెరుగుతున్న తరుణంలో వ్యర్థ పదార్థమైన జట్టును ఇంధనంగా మార్చే ప్రక్రియ పరిశోధక వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
5జీ సేఫ్, ఇంఫా టెక్నాలజీ
గుజరాత్‌కు చెందిన 'టెక్నోఫెస్ట గ్లోబల్' అనే స్టార్టప్ సంస్థ 'బయోమేకర్జ్' అనే విభాగంతో కలిసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. దీనికి 'IMPHA'(ఇన్-విట్రో మెటబాలిక్-ఇంజనీర్డ్ పాత్‌వే ఫర్ హెయిర్ టూ ఆల్కహాల్) అని పేరు పెట్టారు. అంతే కాకుండా దీనికి వాడిన పేటెంట్ పొందిన ప్రక్రియకు '5G SAFE'(5జీ సేఫ్) అని పేరు పెట్టారు. సాధారణంగా సేంద్రీయ పదార్థాల నుంచి ఇథనాల్ తయారు చేసే సమయంలో నిర్వహించే ఈ ప్రక్రియ రసాయన ప్రక్రియను తగ్గించి.. ఒకే దశలో కిణ్వ ప్రక్రియ జరిగేలా దీనిని తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రయోగశాల స్థాయిలో దాదాపు 100 లీటర్ల సామర్థ్యం గల పరిశోధనా కేంద్రంలో దీనిపై ప్రాథమిక ప్రయోగాలు నిర్వహించారు.

ఈ ప్రక్రియ సమయంలో ఎంజైమ్‌లకు ప్రత్యామ్నాయంగా తాము ఉపయోగించే బయోక్యాటలిస్ట్ ను 85 నుంచి 90 శాతం వరకు మళ్లీ రికవరీ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అయితే మానవ జుట్టులో ఎక్కువగా కెరాటిన్ అనే గట్టి ప్రొటీన్ ఉంటుంది. సాధారణ చక్కెరలు, పిండి పదార్థాలతో పోలిస్తే కెరాటిన్‌ను విచ్ఛిన్నం చేసి ఇథనాల్‌గా మార్చడం సైంటిఫిక్‌గా ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. అంతేకాకుండా ఓ కిలోగ్రాము జుట్టు నుంచి వాస్తవానికి ఎంత పరిణామంలో ఇథనాల్ వస్తుంది. ఆ ఇథనాల్ ఇంధన నాణ్యత, స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అనే అంశాలపై సంస్థ పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
జుట్టు సేకరణలో భారీ సవాళ్లు
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సెలూన్లు, బార్బర్ షాపుల నుంచి జట్టును సేకరించడం, దానికి పూసిన హెయిర్ డైలు, నూనెలు వంటి పదార్థాల నుంచి దానిని శుద్ధి చేయడం, ఫ్యాక్టరీకి రవాణా చేయడం వంటి లాజిస్టిక్ సవాళ్లు భారీ ఖర్చుతో కూడుకున్నవి. ల్యాబ్ లేదా పైలట్ ప్రాంట్ ప్రయోగాల నుంచి పారిశ్రామిక స్థాయిలో వేలాది లీటర్ల ఉత్పత్తి సాధించడం అనేది ఆర్థికంగా ఎంతవరకు లాభదాయకం అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రీ-మార్కెట్ పరీక్షల దశలోనే ఉందని, పూర్తిస్థాయి ల్యాబ్ నివేదికలు విడుదలైన తర్వాతే దీని వాణిజ్య అవకాశాలపై స్పష్టత రానుంది.














Click it and Unblock the Notifications
