బంగారం ప్రియులకు బిగ్ షాక్..!
ప్రస్తుతం బంగారం ధరలు అమాంతం పెరిగి, ఆల్ టైం రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. గతంలో రూ. 1.04 లక్షలుగా ఉన్న రికార్డు స్థాయికి ఇప్పుడు కేవలం రూ. 3,000 దూరంలో ఉంది. జూలై 20, ఆదివారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 92,100 ఉంది.
ఈ పెరుగుదల వినియోగదారులకు, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థిక భారాన్ని పెంచుతోంది. మరో నాలుగు రోజుల్లో శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వారి జేబుకు చిల్లు పడేలా చేస్తుంది.

బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి. అమెరికాలోని కామెక్స్ కమోడిటీ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3400 డాలర్ల సమీపానికి చేరింది. అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడం, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలపై టారిఫ్‌లు పెంచినట్లు ప్రకటించడంతో మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీనితో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితంగా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు, ఇది పసిడికి ఒక్కసారిగా డిమాండ్‌ను పెంచి, ధరలు ఆకాశాన్ని తాకేలా చేసింది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు ఆల్ టైం రికార్డును తాకాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 1,26,000 పలుకుతోంది, ఇది చరిత్రలోనే తొలిసారి. పారిశ్రామిక డిమాండ్ అమాంతంగా పెరగడమే వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.












Click it and Unblock the Notifications