మళ్ళీ బ్యాంకుల విలీనం! ఆ 4 బ్యాంకుల్లో వాటాలు తగ్గింపునకు కేంద్రం కసరత్తు
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగంలోని కొన్ని ప్రముఖ బ్యాంకుల్లో తమ వాటాలను తగ్గించుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. నిబంధనల ప్రకారం మార్కెట్లో పబ్లిక్ షేర్ హోర్డింగ్‌ను పెంచే లక్ష్యంతో ఈ కీలక అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం వాటాల విక్రయమే కాకుండా, రాబోయే రోజుల్లో మరో విడత బ్యాంకు విలీనాలు, ప్రైవేటీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఆ నాలుగు బ్యాంకుల్లో వాటా తగ్గింపు.. లక్ష్యం అదే!
మార్కెట్ నిబంధనల ప్రకారం ఏ బ్యాంకులోనైనా కనీసం 25 శాతం పబ్లిక్ షేర్లు ఉండాలి. ఈ నిబంధనను పాటించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వంటి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి కుదించాలని కేంద్రం పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో ఈ నాలుగు బ్యాంకుల్లో ప్రజల వాటాలను పెంచడమే ప్రస్తుతానికి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) పద్ధతి ద్వారా లేదా బ్యాంకులు సొంతంగా నిధులను సమీకరించుకోవడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నారు.

పెరగనున్న షేర్ల విలువ.. మార్కెట్లో జోరు!
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పబ్లిక్ భాగస్వామ్యం పెరిగితే ఆటోమేటిక్‌గా ఆయా బ్యాంకుల షేర్ల విలువ కూడా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియలో కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వాత్సాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ భారీ మొత్తానికి వాటాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మిగిలిన బ్యాంకులను కూడా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాల్లో భాగంగా దేశంలో కేవలం 3 నుంచి 4 భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండాలనేది ప్రభుత్వ అసలు ఉద్దేశంగా తెలుస్తోంది.
మరో రెండు బ్యాంకులకు ప్రైవేటీకరణ ముప్పు? విలీన కసరత్తు షురూ!
కేవలం వాటాల తగ్గింపుతో సరిపెట్టకుండా, బ్యాంకుల మధ్య మరో విడత విలీన ప్రక్రియను తెరపైకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరణ జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అయితే ఈ విలీనాలు లేదా ప్రైవేటీకరణ చేపట్టే ముందు సాంకేతిక సామర్థ్యాలు, భౌగోళిక విస్తృతి, వ్యాపార సరళి వంటి పలు కీలక అంశాలను క్షుణ్ణంగా బేరీజు వేయనున్నారు. ఏ బ్యాంకులను ఎంతో కలిపితే ప్రయోజనకరంగా ఉంటుందనే దానిపై సంబంధిత బ్యాంకుల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.
చట్ట సవరణల ద్వారానే ముందుకు.. ప్రభుత్వ సడలింపులు!
ఈ ప్రైవేటీకరణ, విలీన ప్రక్రియ సాఫీగా సాగాలంటే పార్లమెంటులో కొన్ని చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 'బ్యాంకింగ్ కంపెనీల చట్టం'లో మార్పులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ సంస్థలు కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధన పాటించకుండా ఇచ్చిన మినహాయింపు గడువు త్వరలో ముగియనుండటంతో, దీనికి సంబంధించి ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్రం వేస్తున్న ఈ అడుగులు రాబోయే రోజుల్లో పెద్దఎత్తున చర్చనీయాంశం కానున్నాయి.














Click it and Unblock the Notifications
