భారత్ దూకుడు.. డిజిటల్ చెల్లింపుల్లో IMF ర్యాంకింగ్స్‌లో నంబర్ 1
భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో మైలురాయిని అధిగమించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, వేగవంతమైన రియల్ టైమ్ చెల్లింపుల విభాగంలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఈ ఘనతకు కారణం – దేశీయంగా అమలవుతున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థ.
IMF విడుదల చేసిన 'Growing Retail Digital Payments: The Value of Interoperability’ అనే నివేదికలో వెల్లడించిన ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలలో దాదాపు 50 శాతం వరకు భారతదేశ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఇది ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా భారతదేశ డిజిటల్ మౌలిక వేదికలు అత్యున్నతంగా ఉన్నాయని సూచిస్తోంది.

నెలకు రూ. 24 లక్షల కోట్ల లావాదేవీలు..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో 2016లో ప్రారంభమైన యూపీఐ వేదిక ప్రస్తుతం నెలకు సగటున 18 బిలియన్ లావాదేవీలు, రూ. 24 లక్షల కోట్లకు పైగా విలువతో సాగుతోంది. 2024 జూన్ నెలలో మాత్రమే 18.39 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇది గత ఏడాది అదే నెలతో పోలిస్తే 32 శాతం వృద్ధి.
దేశవ్యాప్తంగా విస్తరించిన డిజిటల్ చెల్లింపులు..
యూపీఐ ఇప్పటివరకు 491 మిలియన్ల వినియోగదారులను, 65 మిలియన్ల వ్యాపారులను, 675 బ్యాంకులను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకురావడమే కాకుండా, నగదు ఆధారిత చెల్లింపులను తగ్గించడంలోనూ కీలకంగా మారింది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తులకు ఇది చవకైన, వేగవంతమైన మరియు సురక్షితమైన మార్గంగా నిలుస్తోంది.
ఇంటర్నేషనల్ ఎక్స్‌పాన్షన్..
UPI సేవలు ఇప్పటికే UAE, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఫ్రాన్స్‌లో సేవలు ప్రారంభించడంతో యూరోప్‌లోకి UPI ప్రవేశించింది. ఇది విదేశాల్లో ఉన్న భారతీయులకు మరియు పర్యాటకులకు చెల్లింపులను సులభతరం చేస్తోంది.
UPI వల్ల గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా డిజిటల్ ఫైనాన్స్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, డేటా లేకపోయినా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా UPI లావాదేవీలు చేయడం వంటి ఫీచర్లు ప్రజల జీవనశైలిని మారుస్తున్నాయి.
ప్రభుత్వ వ్యూహాలకు తోడ్పాటు..
"UPI దేశాన్ని డిజిటల్ చెల్లింపుల దిశగా వేగంగా నడిపించిందని," ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా, ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్, లీన్ ఆన్ క్యాష్ ఎకానమీ వంటి లక్ష్యాలకు UPI ప్రధాన ఆధారంగా నిలుస్తోంది.
భవిష్యత్తు దిశగా ముందడుగు
భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి ఒక ఆదర్శంగా మారింది. డిజిటల్ చెల్లింపుల సాంకేతికత, ఇంటర్‌ఆపరేబిలిటీ, మినిమమ్ కాస్ట్, మాక్సిమమ్ యుటిలిటీ కాన్సెప్ట్లతో యూపీఐ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి. త్వరలోనే వాయిస్ ఆధారిత పేమెంట్స్, ఐవీఆర్ ఆధారిత సేవలు, మొబైల్ లైట్ యాప్‌లు వంటి వాటితో మరింత విస్తృత సేవలు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications