చైనాకు భారత్ బిగ్ షాక్!
ఇండియాకు ఇది నిజంగా ఒక చారిత్రాత్మక విజయమే. గత దశాబ్ధ కాలంగా ప్రపంచ తయారీ కేంద్రంగా వెలుగొందుతున్న చైనాను అధిగమించి అమెరికాకు స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేసే అతిపెద్ద తయారీ కేంద్రంగా భారత్ అవతరించింది. రీసెర్చ్ సంస్థ 'కెనాలిస్' తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ అద్భుతమైన మార్పును స్పష్టం చేసింది. 2025 సంవత్సరంలో భారత్‌లో తయారై అమెరికాకు వెళ్ళే స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్లలో భారీగా 240 శాతం వృద్ధి నమోదైంది. ఇండియా సాధించిన ఈ ఘనత వెనుక ప్రధానంగా ఆపిల్(Apple) సంస్థ కీలక పాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
చైనాను అధిగమించిన భారత్
రీసెర్చ్ సంస్థ కెనాలిస్ నివేదిక ప్రకారం.. అమెరికాకు పంపబడిన అన్ని స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్లలో 44 శాతం వాటా 'మేడ్-ఇన్-ఇండియా' ఫోన్‌లదే. గత సంవత్సరం ఈ సంఖ్య కేవలం 13 శాతం మాత్రమే. అదే సమయంలో 2024లో అమెరికాకు 61 శాతం స్మార్ట్‌ఫోన్లను పంపిన చైనా వాటా ఈ సంవత్సరం కేవలం 25 శాతానికి పడిపోయింది.

ఇండియాకు ఆపిల్ ఎందుకు ప్రత్యేకం?
ఆపివ్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో తన తయారీ స్థావరాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఆపిల్ ఈ ప్రయత్నం వల్ల ఇండియా పూర్తి ప్రయోజనం పొందుతోంది. దీనిపై కెనాలిస్ చీఫ్ ఎనలిస్ట్ సంయం చౌరాసియా మాట్లాడుతూ.. 2025 రెండో త్రైమాసికంలో అమెరికాలో అమ్ముడైన చాలా స్మార్ట్‌ఫోన్లకు భారత్ తయారీ కేంద్రంగా మారడం ఇదే మొదటిసారి అని అన్నారు. అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య యుద్ధం దీనికి ప్రధాన కారణం. దీని వల్ల ఆపిల్ తన తయారీ స్థావరాన్ని ఇండియాకు విస్తరించింది. ఆపిల్ కంపెనీతో పాటు శాంసంగ్, మోటరోలా వంటి ఇతర బ్రాండ్లు కూడా ఇండియాలో తయారైన తమ స్మార్ట్‌ఫోన్లను అమెరికాకు పంపడం ప్రారంభించాయి. అయితే ఆపిల్‌తో పోలిస్తే వాటి సహకారం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది.
స్మార్ట్‌ఫోన్ కంపెనీల మేకింగ్ వ్యూహంలో మార్పు
ఈ కీలక పరిణామం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీల తయారీ వ్యూహంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. 'చైనా ప్లస్ వన్' 6వ్యూహంలో భాగంగా కంపెనీలు ఒకే దేశంపై ఆధారపడకుండా తమ సరఫరా గొలుసులను పెంచుకునేందుకు చూస్తున్నాయి. ఇందులో ఇండియా ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా, ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా') వంటి కార్యక్రమాలు కూడా ఈ మార్పునకు ఊతం ఇస్తున్నాయి.అమెరికాకు స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేయడంలో ఇండియా చైనాను అధిగమించడం కేవలం ఒక గణాంక విజయం మాత్రమే కాదు.. ఇండియా తయారీ రంగం, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఒక కీలకమైన మైలురాయిగా పరిగణించవచ్చు.












Click it and Unblock the Notifications