2018 బడ్జెట్‌లో రైల్వే: ప్రయాణికుల భద్రతే ప్రాణం.. 12 లక్షల సీసీటీవీ కెమెరాలు
Recommended Video

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో దాదాపు 12 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు 2018-19 బడ్జెట్‌లో సుమారు రూ.3000 కోట్ల మేర కేటాయింపులు జరపనున్నది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 395 రైల్వేస్టేషన్లు, 50 రైళ్లలో మాత్రమే సీసీటీవీ కెమెరాల వ్యవస్థ ఉంది. ఇకపై ప్రీమియర్, సబర్బన్ సహా 11వేల రైళ్లు సహా దేశవ్యాప్తంగా ఉన్న 8,500 రైల్వేస్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. బోగీ ద్వారం మొదలుకుని, లోపల అన్ని చోట్లా నిఘా ఉండే విధంగా ఒక్కో కోచ్‌లో మొత్తం ఎనిమిది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
రానున్న రెండేళ్లలో రాజధాని, శతాబ్ది, దురంతో సహా అన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లలో ఈ నూతన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి నిధుల కోసం రైల్వే శాఖ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. అవసరమైతే మార్కెట్ నుంచి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది.

సుమారు 5000 లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు
మరోవైపు గతేడాది పట్టాలు తప్పిన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఎక్కువగా రైల్వేలో భద్రతకు పెద్దపీట వేస్తారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో ప్రస్తావిస్తారు. 4,943 మానవ రహిత లెవెల్ క్రాసింగులను తొలగించడంతో పాటు, పాత పట్టాలను మార్చడం, పట్టాలను మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయి. 2020 నాటికి అన్ని మానవరహిత లెవెల్ క్రాసింగులను తొలగించేందుకు రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రైల్వేల రాకపోకల గురించి 99.3 శాతం సరైన సమాచారం అందుబాటులోకి తేవడానికి జీపీఎస్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం దేశవ్యాప్తంగా తొలిదశలో ఈ ఏడాది చివరి వరకు 2700 ఇంజిన్లలో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెన్ చెప్పారు. మిగతా ఇంజిన్లు, స్టేషన్ల పరిధిలో దశల వారీగా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తొలిదశలో న్యూఢిల్లీ - గువాహటి, న్యూఢిల్లీ - ముంబై మధ్య నడిచే రాజదాని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆరింటిలో వీటిని ఏర్పాటు చేస్తారన్నారు.

నాలుగు మెట్రో కారిడార్ల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు కావాలి
ఈ దఫా రైల్వేల విస్తరణ, ఆధునీకరణ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో రైళ్ల వేగానికీ కేంద్ర ఆర్ధికశాఖ నిధులు కేటాయించడం అత్యవసరం. ప్రత్యేకించి స్వర్ణ చతుర్భుజిలో భాగంగా దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను కలుపుతూ హై స్పీడ్ నెట్ వర్క్ నిర్మాణాన్ని పూర్తిచేసే అంశంపై ద్రుష్టి సారించొచ్చు. వాటిలో ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - హౌరా మధ్య హై స్పీడ్ నెట్ వర్క్ నిర్మాణం కోసం గత ఏడాది బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.11,189 కోట్లు, రూ.6875 కోట్లు కేటాయించారు. మిగతా నాలుగు కారిడార్లు ఢిల్లీ - చెన్నై, చెన్నై - హౌరా, చెన్నై - ముంబై, హౌరా - ముంబై మధ్య హైస్పీడ్ నెట్ వర్క్ నిర్మాణానికి కనీసం రూ.40 వేల కోట్లు అవసరం. ఈ కారిడార్ల నిర్మాణం పూర్తయితే వీటి పరిధిలో రైళ్లు 160 - 200 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. దీనివల్ల 50 శాతం ప్రయాణ సమయం తగ్గముఖం పడుతుంది.

మౌలిక వసతుల కల్పనకు రూ.1.1 లక్షల కోట్లు అవసరం
నూతన మార్గాల విస్తరణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 8000 కి.మీ రైల్వే ట్రాక్ నిర్మాణం, 4000 కిమీ పొడవునా నూతన రైల్ మార్గాల ప్రారంభం, గేజ్ మార్పిడి, నూతన రైళ్ల నిర్మాణం, డబ్లింగ్ తదితర పనులకు దండిగా నిధులు కావాలి. 13 వేల రైల్వే వ్యాగలు, 600కి పైగా విద్యుత్ ఆధారిత లొకోమోటివ్ ఇంజిన్లు, ఎల్ హెచ్ బీ టెక్నాలజీతో తయారుచేసిన 5000 ప్రయాణికుల బోగీలను సమకూర్చాల్సి ఉన్నది. ఇలా మౌలిక వసతుల కల్పన కోసం 2017 - 22 మధ్య రూ.1.1 లక్షల కోట్లు అవసరమని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications