మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే!
బంగారం కొనేటప్పుడు అది అసలుదో కాదో అని భయపడే రోజులకు ఇక కాలం చెల్లింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా, భారత ప్రభుత్వం 'తప్పనిసరి గోల్డ్ హాల్‌మార్కింగ్' నిబంధనలను దేశవ్యాప్తంగా మరింత కఠినతరం చేస్తూ విస్తరించింది. 2026 సవరణ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని మరిన్ని జిల్లాలను ఈ పరిధిలోకి తీసుకువస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల సామాన్యుడు కొనే ప్రతి గ్రాము బంగారానికి స్వచ్ఛత గ్యారెంటీ లభిస్తుంది.
తాజా సవరణ ప్రకారం, దేశవ్యాప్తంగా తప్పనిసరి హాల్‌మార్కింగ్ పరిధిని 380 జిల్లాలకు పెంచారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దీని విస్తరణ భారీగా ఉంది. తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం వంటి 13 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 18 జిల్లాలు ఇప్పుడు ఈ నిబంధనల పరిధిలోకి వచ్చాయి. అంటే, ఈ జిల్లాల్లోని నగల వ్యాపారులు ఇకపై బీఐఎస్ (BIS) హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించడం పూర్తిగా నిషేధం. ఇది కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, రెండు మరియు మూడో అంచె పట్టణాల్లోని వినియోగదారులకు కూడా భద్రతను కల్పిస్తుంది.

Gold హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి?
మనం కొనే ఆభరణంలో బంగారం పాలు ఎంత ఉందో శాస్త్రీయంగా పరీక్షించి, ముద్ర వేసే ప్రక్రియే ఇది. ప్రస్తుతం భారతదేశంలో 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఈ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. నగల వ్యాపారులు తమ వద్ద ఉన్న ఆభరణాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన అసెయింగ్ & హాల్‌మార్కింగ్ (A&H) కేంద్రాలకు పంపి, స్వచ్ఛత పరీక్షలు చేయించిన తర్వాతే విక్రయించాలి. దీనివల్ల వినియోగదారులు నకిలీ బంగారం బారిన పడకుండా, తాము పెట్టిన పెట్టుబడికి సరైన విలువను పొందగలుగుతారు.
256 నుంచి..
2021లో కేవలం 256 జిల్లాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు 380 జిల్లాలకు చేరుకుంది. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక వంటి ప్రధాన రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలను కూడా ఇందులో చేర్చడం ద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలను ప్రభుత్వం నిర్దేశిస్తోంది. బంగారం కేవలం అలంకరణే కాదు, మన దేశంలో అదొక సెంటిమెంట్ మరియు ఆర్థిక భరోసా. అటువంటి పసిడి కొనుగోలులో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయి.












Click it and Unblock the Notifications