పేటీఎంకు RBI బిగ్ షాక్.. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు !!!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) Paytm Payments Bank Limited (PPBL) బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 24 సాయంత్రం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఆర్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన నిర్ణయంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా 2022 మార్చి నుంచే కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేయగా.. 2024 జనవరి-ఫిబ్రవరిలో ఇప్పటికే ఉన్న ఖాతాల్లో డిపాజిట్లు, టాప్-అప్స్, క్రెడిట్ లావాదేవీలపై ఆంక్షలు విధించింది. పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, బ్యాంక్ తన వ్యవస్థలను సరిదిద్దడంలో విఫలమవడంతో చివరకు లైసెన్స్ రద్దు నిర్ణయం తీసుకుంది.

ఆర్‌బీఐ తెలిపిన కీలక కారణాల్లో డిపాజిటర్ల ప్రయోజనాలను విస్మరించడం ప్రధానంగా నిలిచింది. బ్యాంక్ పనితీరు కస్టమర్లకు హానికరంగా మారిందని, Banking Regulation Act, 1949 లోని సెక్షన్ 22(3)(బి) నిబంధనలను పాటించలేదని పేర్కొంది. అదేవిధంగా, బ్యాంక్ యాజమాన్య తీరు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని గుర్తించి, సెక్షన్ 22(3)(సి) కింద కూడా తీవ్ర ఉల్లంఘనగా పరిగణించింది.
లైసెన్స్ మంజూరు సమయంలో విధించిన షరతులను పాటించకపోవడం కూడా కీలక కారణంగా నిలిచింది. ఇది సెక్షన్ 22(3)(జి) ఉల్లంఘనగా ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగించడం వల్ల ప్రజా ప్రయోజనం నెరవేరదని భావించి, కఠిన చర్యలకు దిగింది.
ఈ నేపథ్యంలో, ఆర్‌బీఐ హైకోర్టులో బ్యాంక్‌ను పూర్తిగా మూసివేయడానికి (వైండింగ్ అప్) దరఖాస్తు చేయనుంది. అయితే డిపాజిటర్లకు కొంత ఊరట కలిగించే అంశంగా, బ్యాంక్ వద్ద తగినంత లిక్విడిటీ ఉందని, కస్టమర్ల డబ్బులు పూర్తిగా తిరిగి చెల్లించబడతాయని హామీ ఇచ్చింది.
లైసెన్స్ రద్దు అనంతరం, PPBL సేవలు - సేవింగ్స్ ఖాతాలు, వాలెట్లు, FASTag, UPI లింక్‌డ్ బ్యాంకింగ్ వంటి అంశాలు - క్రమంగా నిలిచిపోయే అవకాశం ఉంది. వినియోగదారులు తమ నిధులను ఇతర బ్యాంకులకు బదిలీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నిర్ణయం ఫిన్‌టెక్ రంగానికి కూడా హెచ్చరికగా మారింది. నియంత్రణ నిబంధనలను పాటించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. భవిష్యత్తులో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థల్లో పారదర్శకత, భద్రతకు మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications