టాటా గ్రూప్‌కు ఆఫ్రికాలో బిగ్ షాక్: బోర్డు తిప్పేయాలని ఆదేశాలు!
ఇండియాలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూపుకు ఆఫ్రికా ఖండంలో బిగ్ షాక్ తగిలింది. కెన్యాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'టాటా కెమికల్స్' కంపెనీని వెంటనే మూసివేయాలని.. దేశం విడిచి వెళ్లాలని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆదేశాలు జారీ చేశారు. ఆ కంపెనీ ఉనికి వల్ల తమ దేశానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదని, అందుకే వారి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.
మైనింగ్ వివాదం.. అధ్యక్షుడి ఆరోపణలు
కెన్యాలోని కజియాడో కౌంటీలో ఉన్న 'మగాడి సరస్సు' ప్రాంతంలో సోడా యాష్ తయారీకి ఉపయోగపడే ఖనిజాలను తవ్వే హక్కులు టాటా కెమికల్స్‌కు ఉన్నాయి. అయితే ఈ ఖనిజాలను స్థానికంగా గాజు లేదా రసాయనాల తయారీకి ఉపయోగించకుండా నేరుగా ఇండియాకు, ఇతర విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని విలియం రూటో ఆరోపించారు. 100 సంవత్సరాల రాయితీ ఒప్పందం ఉన్నప్పటికీ.. గత రెండు దశాబ్ధాలుగా అక్కడ ఉత్పత్తి మాత్రమే చేస్తున్నారని.. స్థానికంగా పరిశ్రమలు కానీ, మౌలిక వసతులు కానీ అభివృద్ధి చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాయల్టీ వివాదం.. ప్రభుత్వ చర్యలు
కంపెనీ నిబంధనలకు అనుగుణంగా రాయల్టీలు చెల్లించకపోవడం, ఇతర ప్రభుత్వ నియంత్రణ నిబంధనలను పాటించకపోవడాన్ని కారణంగా చూపుతూ.. కెన్యా గనుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే టాటా కెమికల్స్ మగాడి లిమిటెడ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ మైనింగ్ స్థలం 1911 నుంచే వినియోగంలో ఉంది. 2005లో 'బ్రన్నర్ మోండ్ లిమిటెడ్' నుంచి టాటా గ్రూప్ ఈ కార్యకలాపాలను కొనుగోలు చేసింది. అయితే ఈ వివాదంపై స్పందించడానికి టాటా కెమికల్స్ ప్రతినిధులు నిరాకరించడం గమనార్హం.
కెన్యా భవిష్యత్ ప్రణాళిక
తమ వనరులను ఇతరులు తరలించుకుపోవడానికి అంగీకరించబోమని విలియం రూట్ స్పష్టం చేశారు. టాటా స్థానంలో కొత్త పెట్టుబడిదారులను తీసుకువస్తామని.. వారు కజియాడో ప్రాంతంలోనే ఓ పెద్ద గాజు తయారీ కర్మాగారాన్ని, రసాయన పరిశ్రమను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్థానిక వనరులతో స్థానికంగానే ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరగాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆందోళన
కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ దేశంలోని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వ మిత్రపక్షాలకు అనుబంధంగా ఉన్న ఇతర కంపెనీలకు ఆ ప్రాంతంలో చమురు అన్వేషణ హక్కులు కట్టబెట్టడానికే టాటా కెమికల్స్‌ను బలవంతంగా పంపిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కంపెనీ మూసివేత వల్ల దాదాపు 500 మంది ప్రత్యక్ష ఉద్యోగులతో పాటు దానిపై ఆధారపడిన వేలాది మంది సహాయక సిబ్బంది రాత్రికి రాత్రే ఉపాధి కోల్పోయారని డెమోక్రసీ ఫర్ సిటిజన్స్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications