Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! TDS, TCS భారీగా తగ్గింపు

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపు పన్ను చట్టంతో (The New Income Tax Act, 2025) సామాన్య పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఊరట లభించనుంది. పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేసి, ప్రతి ఒక్కరూ సులభంగా రిటర్నులు దాఖలు చేసేలా మార్పులు తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ సరళీకృత ఆదాయపు పన్ను నిబంధనలను త్వరలోనే అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు తెలిపారు.

కొత్త చట్టం ప్రకారం, ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫారాలను మరింత సులభతరం చేయనున్నారు. సామాన్య ఉద్యోగులు, చిన్న వ్యాపారులు కూడా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఐటీఆర్‌ దాఖలు చేసేలా ఫారాల రూపకల్పన జరుగుతోంది. ఈ మార్పులతో పన్ను చెల్లింపుదారులపై ఉన్న భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

The New Income Tax Act 2025 from April 1 Major Relief for Taxpayers Lower TDS TCS Cuts and Simplified ITR Filing Announced

పన్ను చెల్లింపుదారులకు మరో ముఖ్యమైన వెసులుబాటుగా, సవరించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు డిసెంబర్‌ 31తో ముగిసే గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నారు. అయితే, ఈ అదనపు గడువు వినియోగించుకునే వారు స్వల్ప రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-2లను దాఖలు చేసే వారి కోసం జూలై 31 గడువు యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

2 శాతానికి పరిమితం..

విదేశీ యాత్రలకు వెళ్లే మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ బడ్జెట్‌ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు విదేశీ టూర్‌ ప్యాకేజీలపై 5 నుంచి 20 శాతం వరకు ఉన్న టీసీఎస్‌ (TCS) రేటును భారీగా తగ్గిస్తూ, 2 శాతానికి పరిమితం చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో విదేశీ ప్రయాణ ఖర్చులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది.

విద్యా వైద్యంపై టీడీఎస్..

విద్యా, వైద్య అవసరాల కోసం చెల్లించే మొత్తాలపై టీడీఎస్‌ను కూడా ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు 5 శాతంగా ఉన్న టీడీఎస్‌ను 2 శాతానికి తగ్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, మ్యాన్‌పవర్‌ సరఫరా చేసే సంస్థలపై కూడా టీడీఎస్‌ రేటును తగ్గిస్తూ చిన్న వ్యాపారులకు ఊరట కల్పించారు.

పరిహారంపై పన్ను విధించబోం..

రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు లభించే పరిహారంపై వచ్చే వడ్డీపై ఇకపై పన్ను విధించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇది బాధిత కుటుంబాలకు పెద్ద ఊరటగా మారనుంది. మరోవైపు, చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. ఈ పథకం ద్వారా చిన్న మొత్తాల్లో పన్ను బాకీలు ఉన్నవారికి సరళమైన పరిష్కార మార్గం అందించనున్నారు.

ఇకపై జరిమానాలు తప్పవు..

పన్ను క్రమశిక్షణను బలోపేతం చేసే దిశగా, నాన్‌ రెసిడెంట్లు భారత్‌లో స్థిరాస్తులు విక్రయించినప్పుడు తప్పనిసరిగా టిడిఎస్‌ విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించని వారికి ఇకపై జరిమానాలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటివరకు శిక్ష లేని కొన్ని నాన్‌-ఇమ్మూవబుల్‌ ఆస్తుల వివరాలు వెల్లడించకపోయినా, కొత్త చట్టం ప్రకారం జరిమానా విధిస్తామని మంత్రి తెలిపారు.

ఆదాయాన్ని తప్పుగా ప్రకటిస్తే..

చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆరు నెలల పాటు ప్రత్యేక విదేశీ ఆస్తుల వెల్లడి పథకాన్ని కూడా ప్రభుత్వం తీసుకురానుంది. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్న ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించే వారికి పరిమిత కాల అవకాశం కల్పించనున్నారు. అయితే, ఆదాయాన్ని తప్పుగా ప్రకటిస్తే చెల్లించాల్సిన పన్నుకు సమానంగా 100 శాతం జరిమానా విధిస్తామని నిర్మలా సీతారామన్‌ కఠినంగా హెచ్చరించారు.

టెక్నాలజీ రంగానికి సంబంధించి కూడా కీలక మార్పులు ప్రకటించారు. ఐటీ ఎనేబుల్డ్‌ సర్వీసులు, నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (KPO), సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కాంట్రాక్ట్‌ ఆర్‌అండ్‌డీ సేవలను ఒకే ఐటీ సేవల కేటగిరీగా పరిగణించనున్నట్లు తెలిపారు. వీటన్నింటికీ ఒకే 'సేఫ్‌ హార్బర్‌' ఫ్రేమ్‌వర్క్‌ వర్తింపజేస్తూ, 15 శాతం సాధారణ మార్జిన్‌ను నిర్ణయించారు. దీంతో ఐటీ, ఆర్‌అండ్‌డీ రంగాల్లో పన్ను విధానం మరింత స్పష్టంగా మారనుంది.

2047 వరకు పన్ను సెలవులు..

అలాగే, భారతదేశంలో క్లౌడ్‌ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను సెలవులు ప్రకటిస్తూ, డిజిటల్‌ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ నిర్ణయంతో భారత్‌లో గ్లోబల్‌ క్లౌడ్‌ కంపెనీల పెట్టుబడులు పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

మొత్తంగా, కొత్త ఆదాయపు పన్ను చట్టం సామాన్యులకు సరళత, పారదర్శకతను అందించడమే కాకుండా, పన్ను క్రమశిక్షణను బలోపేతం చేసేలా రూపుదిద్దుకున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+