దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల మెరుపు సమ్మె: స్తంభించిన రూ. వేల కోట్ల లావాదేవీలు
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు శుక్రవారం స్తంభించిపోయాయి. బ్యాంకు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వారానికి అయిదు రోజుల పనిదినాలను ప్రవేశపెట్టాలని, ఇతర పెండింగ్ అంశాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు రోడ్డెక్కారు.
ఈ సమ్మె దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సర్వీసులపై ప్రభావం చూపింది. ప్రధాన కార్యాలయాలు, వివిధ శాఖల పరిధిలో బ్యాంక్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కారణంగా దేశంలోని అత్యధిక ప్రభుత్వ రంగ బ్యాంకులలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్కుల క్లియరెన్స్, ఇతర పరిపాలనాపరమైన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ప్రైవేట్ బ్యాంకులలో సైతం సేవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

ఖాతాదారుల సౌకర్యార్థం యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటోన్నాయి. ఒక్క మధ్యప్రదేశ్ లోనే దాదాపు 7,000 బ్యాంకులు మూతపడ్డాయి. సుమారు రూ. 5,500 కోట్ల విలువైన రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోయాయి. సుమారు 42,000 మంది ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి.
బ్యాంకింగ్ రంగంలోని వివిధ ఉద్యోగ సంఘాలు సుదీర్ఘ కాలంగా వారానికి అయిదు రోజుల పని విధానాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని శనివారాలు కూడా సెలవు దినాలుగా గుర్తించాలనే ప్రతిపాదన కేంద్రం ముందు పెట్టారు. 2024 మార్చిలో కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపై తుది నోటిఫికేషన్ విడుదల కాకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం నెలలో ఒకటి, మూడు, అయిదో శనివారాల్లో బ్యాంకులు పనిచేస్తోన్నాయి. వాటన్నింటినీ కూడా సెలవు రోజులుగా పరిగణించాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తోన్నారు. పనిదినాల సంఖ్యను తగ్గించడమే కాకుండా పెన్షన్ల సవరణ, పింఛనర్లకు ఒకే విధమైన ఫార్ములాను వర్తింపజేయడం వంటి ఇతర డిమాండ్ల కోసం కూడా ఆయా సంఘాలు పట్టుబట్టాయి.
#WATCH | Delhi | United Forum of Bank Unions hold protest in Dwarka demanding 5-day work week and banking reforms. pic.twitter.com/swrXcZIk66
— ANI (@ANI) September 11, 2026
నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఉన్న ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. వాటిని పరిష్కరించడంలో కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని, తమను నిర్లక్ష్యం చేస్తోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. కేంద్రం దిగివచ్చేంత వరకూ తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు.













Click it and Unblock the Notifications
