బొగ్గుపై దిగుమతి సుంకం మాఫీ చేయండి: ఉక్కు మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించడానికి ముందు వివిధ శాఖలు, పరిశ్రమలు, కార్పొరేట్ వర్గాలతో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ భేటీ కావడం సంప్రదాయం. అయితే మంత్రి జైట్లీతో సమావేశమైన ఉక్కు మంత్రిత్వశాఖ.. సంబంధిత రంగ పరిశ్రమ కంటే ముందే రాయితీలివ్వాలని కోరింది. దేశీయ పారిశ్రామిక రంగ ప్రగతిలో ఉక్కు పరిశ్రమ ఎంత కీలకమో చెప్పనవసరం లేదు. మౌలిక వసతుల కల్పనలో ముఖ్యమైన ఈ ఉక్కు పరిశ్రమ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, స్టీల్ స్క్రాప్ దిగుమతిపై పూర్తిగా సుంకం ఎత్తేయాలని ఆర్థిక మంత్రిత్వశాఖను ఉక్కు శాఖ కోరింది.
ఈ సందర్భంగా ఉక్కు శాఖ కార్యదర్శి అరుణశర్మ మాట్లాడుతూ 'ప్రస్తుతం బొగ్గు దిగుమతిపై ఉన్న 2.5 శాతం దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని మేం ఆర్థిక మంత్రిత్వశాఖకు లేఖ రాశాం' అని తెలిపారు. భారత ఉక్కు పరిశ్రమ అవసరాలన్నీ పూర్తిగా బొగ్గు దిగుమతిపైనే ఆధారపడి ఉన్నాయి. దేశీయంగా లభించే బొగ్గు, యాష్ నాణ్యత ఉక్కు పరిశ్రమకు అవసరమైన దానికంటే ఎక్కువ నాణ్యత కలిగి ఉన్నాయి.

ప్రస్తుత టెక్నాలజీతో దేశీయ బొగ్గు వాడలేం
ప్రస్తుత టెక్నాలజీతో ఉక్కు పరిశ్రమ అవసరాలను దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో తీర్చుకోలేమని ఉక్కు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రతిఏటా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 22.6 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకున్నామని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2015 - 16లో ఉక్కు మంత్రిత్వశాఖ 41.6 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకున్నది. అయితే ఏ యేటికాయేడు బొగ్గు దిగుమతి తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నామని పీయూష్ గోయల్ వివరించారు.

దిగుమతి సుంకం తగ్గించాలని సూచించిన ఫర్నెసెస్ అసోసియేషన్
సెకండరీ స్టీల్ ఇండస్ట్రీ బాడీ 'ఆల్ ఇండియా ఇండక్షన్ ఫర్నెసెస్ అసోసియేషన్ (ఏఐఐఎఫ్ఎ) కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనల్లో బొగ్గు దిగుమతిపై సుంకం పూర్తిగా ఎత్తేయాలని కేంద్రాన్ని కోరింది. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చేనెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications