టెక్కీలకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన విప్రో
దేశీయ టెక్ దిగ్గజం.. విప్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగుల జీతాల పెంపుదలను మార్చి 1 నుండి అమలు చేయనుంది. సెప్టెంబర్ 2024లో చివరిసారిగా ఇంక్రిమెంట్లు ఇచ్చిన తర్వాత మళ్లీ అప్రైజల్స్ ప్రకటించడం ఇదే తొలిసారి. దాదాపుగా ఏడాదికి పైగా వాయిదా పడుతూ వచ్చిన ఈ నిర్ణయం ఇప్పుడు అమలులోకి వస్తోంది. పెరిగిన జీతాల శాతం ఎంత అనే దానిపై విప్రో యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, క్లయింట్లు టెక్నికల్ బడ్జెట్‌ను కుదించడం వంటి కారణాలతో గతంలో బేస్ పే సవరణలను నిలిపివేసింది విప్రో. వేతన పెంపుదల విషయంలో యాజమాన్యం ఇంకా తర్జనభర్జన పడుతోందని, దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్. అప్రైజల్స్ ఉంటాయని, ఎప్పుడనే విషయంపై ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని అన్నారు.

దీనికి వాస్తవ రూపాన్ని ఇచ్చింది విప్రో మేనేజ్మెంట్. మార్చి 1 నుండి జీతాలు పెంచనున్నట్లు తెలిపింది. ఈ వేతన పెంపుదల ఇతర పోటీ కంపెనీల విధానాలతో పోలిస్తే భిన్నంగా ఉంటోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన వేతన పెంపుదల సైకిల్ ను ఏప్రిల్ నుండి సెప్టెంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుండి రెండు నుండి ఎనిమిది వాతం వరకు పెంపుదలను అమలు చేసింది. ఇన్ఫోసిస్ దశలవారీగా ఇంక్రిమెంట్లను విడుదల చేసింది. అయిదు నుండి ఎనిమిది శాతం వరకు పెరుగుదల లభించింది.
కాగ్నిజెంట్ కూడా మొదట జీతాల పెంపుదలను వాయిదా వేసింది గానీ.. సంవత్సరంలోపే వాటిని తిరిగి ప్రారంభించింది. ఇక తాజాగా విప్రో కూడా అదే బాట పట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో విప్రో ఆదాయం 5.5 శాతం పెరిగి 23,555 కోట్ల రూపాయలకు చేరుకుంది. నికర లాభాలు ఏడు శాతం తగ్గాయి. 3,145 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
బేస్ శాలరీ పెంపుదల వాయిదా పడినప్పటికీ, విప్రో వేరియబుల్ పరిహారాన్ని చెల్లించడం కొనసాగించింది. డిసెంబర్ 31 ముగిసిన త్రైమాసికానికి సంబంధించి నూరుశాతం త్రైమాసిక వేరియబుల్ పే అవుట్‌ను ఫిబ్రవరి జీతాలతో కలిపి పంపిణీ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు రెండు త్రైమాసికాల్లో 90 శాతానికి పైగా చెల్లింపులు జరిగాయి. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడే వరకు ఎంట్రీ లెవల్స్, ఫ్రెషర్స్ కు పరిమితంగా ఉండొచ్చు.












Click it and Unblock the Notifications