Zomato: ఈ కొత్త ఛార్జ్ చూశారా? క్యాష్ ఆన్ డెలివరీ అంటే బాదుడే
ఫుడ్ లవర్స్ కు ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం 'జొమాటో' ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికే రెస్టారెంట్ ఛార్జీలు, ప్యాకేజింగ్ ఫీజులు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, డెలివరీ ఛార్జీలు, జీఎస్‌టీ భారాన్ని మోస్తున్న కస్టమర్లపై మరో కొత్త ఛార్జ్ మోపింది. ఇకపై ఫుడ్ డెలివరీ అయిన తర్వాత చేతికి నగదు ఇచ్చే 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) ఆప్షన్ ఎంచుకుంటే ప్రత్యేకంగా అదనపు ఛార్జీ వసూలు చేయడం ప్రారంభించింది. కస్టమర్ల నుంచి వచ్చే ప్రతి రూపాయిని వదలకుండా రాబట్టుకునేందుకు కంపెనీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఏంటి ఈ కొత్త 'పే ఆన్ డెలివరీ' ఛార్జ్?
సాధారణంగా ఆన్‌లైన్ పేమెంట్లు చేయకుండా, ఫుడ్ డోర్ ముందుకు వచ్చాక చేతికి డబ్బులు ఇచ్చే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటి వారికి జొమాటో చెక్ పెట్టింది. యాప్‌లో బిల్ సమరీ పరిశీలిస్తే.. క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న ఆర్డర్లకు ప్రాథమికంగా రూ. 5 చొప్పున "పే ఆన్ డెలివరీ ఫీజు" (Pay on delivery fee) పేరిట అదనంగా బిల్లులో కలిపేస్తోంది. కొన్ని ప్రాంతాలు, యూజర్ల ఆధారంగా ఈ రుసుము రూ. 7 నుంచి గరిష్టంగా రూ. 20 వరకు కూడా మారుతున్నట్లు సమాచారం. అయితే, ముందే యూపీఐ (UPI) లేదా కార్డ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేసేవారికి ఈ ఛార్జీ వర్తించదు.

చిన్న మొత్తంలా అనిపిస్తుందా? ఏటా రూ. 400 కోట్ల ఆదాయం!
కస్టమర్‌కు రూ. 5 అంటే చాలా చిన్న మొత్తంగానే అనిపించవచ్చు. కానీ జొమాటో వ్యాపార పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇది కొన్ని వందల కోట్ల భారీ సామ్రాజ్యం! జొమాటో యాప్ ద్వారా దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 23 లక్షల నుంచి 25 లక్షల ఫుడ్ ఆర్డర్లు జరుగుతుంటాయి. ఒకవేళ వీరందరూ క్యాష్ ఆన్ డెలివరీ వాడితే.. కంపెనీకి కేవలం ఈ రూపంలోనే రోజుకు రూ. 1.25 కోట్ల అదనపు రాబడి వస్తుంది. అంటే ఏడాదికి లెక్కేస్తే సుమారు రూ. 420 కోట్ల నుంచి రూ. 450 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చి పడుతుందన్నమాట!
ప్లాట్‌ఫామ్ ఫీజుల మోత.. రూ. 2 నుంచి రూ. 15 దాకా!
గతంలో కేవలం ఫుడ్ బిల్లు, డెలివరీ ఛార్జ్ మాత్రమే ఉండే ఆన్‌లైన్ ఆర్డర్లలో మెల్లమెల్లగా రూ. 2 తో 'ప్లాట్‌ఫామ్ ఫీజు' సంస్కృతి మొదలైంది. పోటీ పడి మరీ కంపెనీలు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచుకుంటూ పోయాయి. ఇటీవల జొమాటో తన ప్లాట్‌ఫామ్ ఫీజును ఏకంగా రూ. 14.99 (జీఎస్‌టీ అదనం)కి పెంచేసింది. ఇప్పుడు డెలివరీ రకాన్ని బట్టి కూడా ఛార్జీ వేస్తుండటంతో.. కస్టమర్ల జేబులకు మరింత చిల్లు పడుతోంది. ఒక్క ఈ కామర్స్, ఫుడ్ యాప్‌లే ప్లాట్‌ఫామ్ ఫీజుల రూపంలో దేశవ్యాప్తంగా ఏటా రూ. 3,500 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల వరకు రాబడుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.
పోటీ పెరిగినా తగ్గేదే లేదంటున్న దిగ్గజం!
ఒకవైపు రాపిడో 'ఓన్లీ' (Ownly), ఫ్లిప్‌కార్ట్ 'ఈట్ ఇన్' (Eat In) వంటి కొత్త ప్లాట్‌ఫామ్‌లు, సరికొత్త స్టార్టప్‌లు ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగుతూ పోటీని తీవ్రం చేస్తున్నాయి. స్విగ్గీ, జొమాటోల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. పోటీ ఎంత పెరిగినా.. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, డెలివరీ బాయ్స్ వద్ద క్యాష్ నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా జొమాటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రత్యర్థి స్విగ్గీ ఇంకా ఈ నిర్ణయం తీసుకోకపోయినా, త్వరలోనే వాళ్లు కూడా ఇదే బాట పడతారేమో చూడాలి. ఏది ఏమైనా, బిర్యానీ ఆర్డర్ చేసే సగటు మనిషికి మాత్రం ఈ రూపంలో బిల్లు మోత తప్పడం లేదు!














Click it and Unblock the Notifications
