చెన్నై నగరం షట్ డౌన్-కుండపోత : వరద నీటిలోనే సీఎం స్టాలిన్ ముందుకు..!!
చెన్నై వణుకుతోంది. చెన్నై వాసులు భయం భయంగా గడుపుతున్నారు. చెన్నైలోని పలుప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచింది. చెన్నై సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయర్ గేట్లు తెరిచారు. వరద ప్రవాహం పెరగడంతో పుజల్ డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో నీరు పరవళ్ళు తొక్కుతోంది.

చెన్నైలో ఫ్లడ్ అలర్ట్
ఇక, సిటీలో 'ఫ్లడ్ అలర్ట్'ను అధికారులు ఆదివారంనాడు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్లకు స్టేట్ వాటర్ రిసోర్సెస్ అధారిటీ సూచించింది. శనివారం ఉదయం నుంచి చెన్నై, కాంచీపురంలోని పలు సబర్బన్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో చాలా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 2015 నుంచి ఇంత భారీ వర్షాలు సిటీలో చూడలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 10 వరకూ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

నగరాన్ని ముంచెత్తిన వర్షాలు
ఎన్నడూ లేని విధంగా చెన్నైని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు రాయపురంలో ఇల్లు కూలి ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 20 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదని ఆదేశాలు జారీచేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, ముంపు ప్రభావిత ప్రాంతాల వారికి సూచించారు. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లోగా 'మహా వాయుగుండం'గా తీవ్రరూపం దాల్చనుండడంతో ఈనెల 12వ తేదీ వరకు రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.

తమిళనాడు వ్యాప్తంగా కుండపోత
గరిష్టంగా ఈరోడ్ జిల్లా గోపిశెట్టిపాళయంలో 11 సెం.మీ, విరుదునగర్, సేలం, నామక్కల్, శ్రీవిల్లిపుత్తూర్, రాశిపురం, మదురై, శివకాశి, కడలూరు జిల్లాల్లో తలా 8 సెం.మీ, కొడైకెనాల్, కోవిల్‌పట్టి, ఖయత్తారు ప్రాంతాల్లో తలా 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో 11,12 తేదీల్లో గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన నీలగిరి, కొడైకెనాల్‌లలో కురుస్తున్న భారీవర్షాలకు ఘాట్ రోడ్డులో మట్టిపెళ్లలు, బండరాళ్లు జారిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రంగంలోకి సీఎం స్టాలిన్..ముంపు ప్రాంతాల్లో
నీలగిరి జిల్లాలోని కున్నూరు, కుందా రోడ్డు, కరుంపాలం, పీక్కాడు ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీటిలో క్యారెట్, క్యాబేజీ తదితర పంటలు మునిగిపోయాయి. అదేవిధంగా దిండుగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొడైకెనాల్ ప్రాంతంలో రహదారుల్లో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. ఘాట్ రోడ్డులో చెట్లు, విద్యుత్ స్తంభాలు, మట్టిపెళ్లలు జారిపడడంతో ఆ మార్గంలో వాహనాల్లో వెళ్లిన సందర్శకులు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఇక, చెన్నై నగరం పూర్తిగా వర్షపు నీటిలో ఉండటంత సీఎం స్టాలిన్ నేరుగా రంగంలోకి దిగారు.
Recommended Video

నేరుగా పరిశీలన..అధికారులకు ఆదేశాలు
సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో అధికారులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఇప్పటికే వర్షాల పరిస్థితి పైన నిరంతం సమీక్షలు చేస్తున్న సీఎం స్టాలిన్ కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసారు. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్, టెలిఫోన్ స్తంభాలను గుర్తించి తక్షణం తొలగించాలని, ప్రాణనష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో కలసి అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెయిన్ కోట్ తో సీఎం స్వయంగా వర్షపు నీటిలోనే తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించటంతో పాటుగా.. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications