వెళ్లి.. సీఎంను అడగండి: విద్యుత్ బిల్లుల వసూలుకు వెళ్లిన ఉద్యోగిని కొట్టిన వ్యక్తి.. అరెస్ట్
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి- ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. దీన్ని తన మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య- ఈ హామీని అమలు చేశారు. తొలి కేబినెట్‌లోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేశారు.
ఈ హామీని అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాల రూపకల్పనపై ఇంధనశాఖ అధికారులు కసరత్తు చేస్తోన్నారు. అవి కొలిక్కి రాగానే అమలు చేస్తామని చెబుతున్నారు. ఈలోగా అనర్థాలు జరిగిపోతోన్నాయి. విద్యుత్ బిల్లులను చెల్లించడానికి జనం ససేమిరా అంటోన్నారు. బిల్లులను చెల్లించే విషయంలో మొండికేస్తోన్నారు. వెళ్లి.. సీఎంను అడగాలంటూ మొహం మీదే తేల్చేస్తోన్నారు.

విద్యుత్ బిల్లుల వసూళ్ల వ్యవహారం- విద్యుత్ సిబ్బంది ప్రాణాల మీదికి వస్తోంది. బిల్లులను వసూలు చేయడానికి వెళ్లిన సిబ్బందిపై స్థానికులు దాడులు చేస్తోన్నారు. ఇటీవలే చిత్రదుర్గ జిల్లాలో గ్రామస్తులు విద్యుత్ బిల్లులను కట్టడానికి నిరాకరించారు. ఈ విషయంలో సిబ్బందినూ ఘర్షణ పడ్డారు. వారితో వాగ్వివాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు కట్టబోమంటూ భీష్మించారు.
తాజాగా అలాంటి ఉదంతమే కొప్పల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కుకనపల్లి గ్రామంలో విద్యుత్ బకాయిలను వసూలు చేయడానికి వెళ్లిన గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (జెస్కం) ఉద్యోగి మంజునాథ్‌పై చంద్రశేఖర్ హిరేమఠ్ అనే వ్యక్తి దాడి చేశాడు. చెప్పుతో కొట్టాడు. బూతులు తిట్టాడు. ఆరు నెలలుగా చంద్రశేఖర్ హిరేమఠ్ కరెంటు బిల్లులు కట్టట్లేదు. అతను చెల్లించాల్సిన మొత్తం బిల్లులు విలువ 9,990 రూపాయలు.
ఈ మొత్తాన్ని వసూలు చేయడానికి మంజునాథ్ అనే లైన్‌మెన్ చంద్రశేఖర్ హిరేమఠ్ ఇంటికి వెళ్లగా.. అతను గొడవకు దిగాడు. ఫ్యూజులను తొలగించడానికి ప్రయత్నించిన మంజునాథ్‌ను కొట్టాడు. అతనిపై చెప్పులను విసిరేశాడు. మంజునాథ్‌తో పాటు వెళ్లిన మరో ఉద్యోగి- ఈ ఘటనను సెల్ ఫోన్‌లో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Electricity officials are attacked by local residents in Karnataka when they came for meter reading.
— Rishi Bagree (@rishibagree) May 24, 2023
Residents says that they won’t pay from electricity now onwards as per Congress Guarantee
pic.twitter.com/T0sVUjD2Ux
ఈ వీడియో పోలీసుల దృష్టికి చేరడంతో వారు కేసు నమోదు చేశారు. మునీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో చంద్రశేఖర్ హిరేమఠ్‌పై కేసు నమోదైంది. కరెంటు మీటర్ రిజిస్ట్రేషన్‌ను మార్చాలంటూ తాను జెస్కం సిబ్బందిని పలుమార్లు కోరానని, అయినప్పటికీ వారు వినిపించుకోలేదని హిరేమఠ్ చెబుతున్నాడు. గొడవ విద్యుత్ బిల్లులకు సంబంధించినది కాదని వివరణ ఇచ్చాడు. తాను డబ్బులు కట్టబోనని, ఏది కావాలంటే అది చేసుకోండంటూ తేల్చి చెప్పాడు.












Click it and Unblock the Notifications