అష్ట ఐశ్వర్యాలు పొందే మార్గమన్నారు... ఆఖరికి ఉన్నవి ఊడ్చుకుపోయి షాకిచ్చారు...
ప్రపంచం ఆధునికత వైపు వేగంగా పరుగులు పెడుతున్నా ఇప్పటికీ మూఢ నమ్మకాల జాఢ్యం జనాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. మంత్ర తంత్రాలకు ఎటువంటి మహత్తు లేదని ఓవైపు జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఎంత ప్రచారం చేస్తున్నా... వాటిని విశ్వసించేవారు,విలువనిచ్చేవారు ఇప్పటికీ సమాజంలో చాలామందే ఉన్నారు. ఇలాంటి జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దొంగ స్వామిజీలు,దొంగ బాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి మోసమే వెలుగుచూసింది.

ఈ నెల 18న...
చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన మురళి,విశ్వనాథ్ అనే అన్నదమ్ములు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం(జనవరి 18) మదనపల్లెలో టమాటాలు కొనుగోలు చేసి లారీలో లోడ్ చేసుకుని తిరుపతి బయలుదేరారు. మార్గమధ్యలో తట్టివారిపల్లె జంక్షన్ వద్ద ఆరుగురు రాజస్తానీ స్వాముల బృందం ఎదురుపడింది.

అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని నమ్మబలికి...
స్వామీజీలను చూడగానే ఆ ఇద్దరు అన్నదమ్ములు లారీ నుంచి దిగి వారి వద్దకు వెళ్లి ఆశీర్వాదం కోరారు. తాము చెప్పినట్లు చేస్తే మీకు అష్టైశ్వరాలు సిద్దిస్తాయని ఈ సందర్భంగా స్వామిజీలు వారితో చెప్పారు. ఇందుకోసం స్వామిజీలు చెప్పినట్లు అప్పటికప్పుడే స్థానిక బంధువుల ఇంట్లో హోమానికి ఏర్పాట్లు చేశారు. రూ.20వేలు ఖర్చు పెట్టి హోమానికి అవసరమైన సామాగ్రి తెచ్చారు. స్వామిజీల సూచనల మేరకు మెడలోని 60గ్రా. బంగారు రుద్రాక్ష మాలలు,రూ.20వేలు నగదు హోమ గుండం ముందు పెట్టారు.

హోమం పేరుతో హడావుడి... ఎస్కేప్...
కొద్దిసేపు మంత్రాలు పఠిస్తూ హడావుడి చేసిన స్వామీజీలు... ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటకు జారుకున్నారు. ఇదంతా పూజా క్రతువులో భాగమని నమ్మించడంతో కళ్లముందే వారు జారుకున్నా... ఆ అన్నదమ్ములు తాము మోసపోతున్నామని పసిగట్టలేదు. తీరా తేరుకునేలోపే స్వామిజీల బృందం కారులో ఉడాయించింది. పూజలో పెట్టిన బంగారం,నగదును కూడా స్వామిజీలే పట్టుకెళ్లారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ అన్నాదమ్ములు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.