టీడీపీ ఎప్పుడూ గెలవని స్థానంపై కన్నేసిన చంద్రబాబు- అభ్యర్థిగా జర్నలిస్టు
చిత్తూరు: చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. జిల్లాలోని పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించారు. స్థానిక జర్నలిస్ట్ మురళీ మోహన్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. మురళీ మోహన్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబు.
జనసేనతో పొత్తు కొలిక్కి రాకముందే అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలే పవన్ కల్యాణ్.. తెనాలి అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. తెనాలి నుంచి జనసేన తరఫున పోటీ చేస్తారని చెప్పారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి- పూతలపట్టు. ఎస్సీ రిజర్వుడ్ స్థానం ఇది. 2009లో నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవలేదిక్కడ. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
2009లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పీ రవి విజయం సాధించారు. ఎల్ లలిత కుమారిని ఓడించారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎం సునీల్ కుమార్ 902 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 2019లో ఎంఎస్ బాబు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు పూతలపట్టులో. 29,163 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని మట్టి కరిపించారు.
ఈ మూడు ఎన్నికల్లోనూ పూతలపట్టు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎల్ లలితకుమారే పోటీ చేశారు గానీ విజయం సాధించలేకపోయారు. ఈ సారి ఆమెకు మళ్లీ టికెట్ ఇవ్వదలచుకోలేదు చంద్రబాబు. లలిత కుమారికి బదులుగా జర్నలిస్టు మురళీ మోహన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఇక్కడ పోటీ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications