తూగో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- చిన్నారి సహా ఆరుమంది దుర్మరణం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అతి వేగం ఓ నిండు కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టిన ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలను కోల్పోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.
తూగో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- చిన్నారి సహా ఆరుమంది దుర్మరణం..!! pic.twitter.com/A1u9nZFFBj
— oneindiatelugu (@oneindiatelugu) June 12, 2023
తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన సంభవించింది. విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరిన కారు.. మార్గమధ్యలో నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. అతి వేగానికి అదుపు తప్పి.. లారీని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న వారందరూ దుర్మరణం పాలయ్యారు.

మృతుల్లో రెండేళ్ల వయసు ఉన్న చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. లారీ కింది భాగంలోకి చొచ్చుకెళ్లిందంటే వేగం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవర్ టేక్ చేస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తోన్నారు. ఓ శుభకార్యంలో పాల్గొనడానికి వారంతా రాజమండ్రికి బయలుదేరి వెళ్తోన్నట్లు తెలుస్తోంది.
ప్రమాద స్థలం మొత్తం రక్తసిక్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల ఇతర కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications