పెద్దాపురం, రామచంద్రపురం అభ్యర్ధుల్ని ప్రకటించిన వైసీపీ-త్వరలో కోనసీమ కేసుల ఎత్తివేత..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీని మరోసారి విజయం దిశగా నడిపేందుకు అధినాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసే అభ్యర్దుల్ని ప్రకటించారు.
రామచంద్రపురం: జిల్లాల విభజనకు ముందు అత్యధిక అసెంబ్లీ సీట్లు కలిగిన జిల్లాగా పేరు తెచ్చుకున్న ఉమ్మడి తూర్పుగోదావరిలో 2019 ఎన్నికల్లో అత్యధిక సీట్లు కూడా గెలిచిన వైసీపీ మరోసారి అదే ఫీట్ రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు సీట్లకు 2024లో పోటీ చేసే అభ్యర్ధుల్ని ఇవాళ ప్రకటించారు.
ఉభయగోదావరి జిల్లాలకు వైసీపీ పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి.. ఇవాళ పెద్దాపురం, రామచంద్రపురం అసెంబ్లీ సీట్లకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. ఇందులో రామచంద్రపురంలో మరోసారి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ చేయనుండగా.. పెద్దాపురంలో వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న దవులూరి దొరబాబు పోటీ చేస్తారని మిధున్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. ఈ మేరకు వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తున్నట్లు మిధున్ తెలిపారు.

రామచంద్రపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిగిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన పోటీపై క్లారిటీ ఇచ్చేయడం ద్వారా నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యర్ధులు తోట త్రిమూర్తులు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు క్లారిటీ ఇచ్చినట్లయింది. అలాగే పెద్దాపురం సీటులో గత ఎన్నికల్లోనే దవులూరి దొరబాబుకు సీటు ఇవ్వాల్సి ఉండగా.. చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఎంపీ తోట నర్సింహం సతీమణి తోట వాణిని ఇక్కడ బరిలోకి దింపారు. దీంతో ఇక్కడ ఆమెను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చినరాజప్ప ఓడించారు. ఇప్పుడు ఎన్నికలకు చాలా ముందుగానే దొరబాబును అభ్యర్ధిగా ప్రకటించారు.
మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీకి కీలకంగా మారిన కోనసీమ అల్లర్ల కేసులపైనా ప్రభుత్వం దృష్టిసారించింది. అప్పట్లో జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేసిన ఇతర పార్టీల నేతలు, సొంత పార్టీ నేతలపైనా వైసీపీ సర్కార్ కేసులు పెట్టింది. ఇప్పుడు ఆ కేసుల్ని ఎత్తేస్తామని ఎంపీ మిధున్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ కేసుల్ని ఎత్తేస్తామని ఇవాళ మిథున్ రెడ్డి చేసిన ప్రకటన వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేసిందేనని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications