2026లో తొలి శక్తిమంతమైన పౌర్ణమి.. డోన్ట్ మిస్
హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి అత్యంత పుణ్యప్రదమైనది. 2026 సంవత్సరంలో మొదటి పౌర్ణమి, పుష్యమాసం శుక్లపక్షంలో వస్తుంది. ఈ రోజున చంద్రుడు తన 16 కళలతో ఆకాశంలో ప్రకాశిస్తాడు. ఈ రోజున పవిత్ర నదులలో స్నానమాచరించి, దానధర్మాలు చేసి, సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల విశేష ఫలితాలనిస్తుందని నమ్ముతారు. ప్రయాగ్‌రాజ్‌లో ప్రసిద్ధ మాఘమేళా కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది, ఇది భారతదేశ ముఖ్య ఆధ్యాత్మిక పండుగలలో ఒకటి.
పుష్య పౌర్ణమిని హిందూ ధర్మంలో ఒక విశిష్ట పుణ్యతిథిగా పరిగణిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం, పవిత్ర స్నానాలు ఆచరించడం, దానధర్మాలు చేయడం వల్ల వ్యక్తి పాపాలు తొలగిపోయి, జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు సిద్ధిస్తాయని నమ్ముతారు. గంగా, యమున లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి, విష్ణువును పూజించి, పేదలకు దానమివ్వడం ద్వారా జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

2026లో ఈ పవిత్ర పౌర్ణమి జనవరి 3వ తేదీన వస్తుంది. ఈ రోజున వ్రతాలు, పూజలు ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ పుణ్యకార్యాల ద్వారా పితృదేవతల ఆశీస్సులు కూడా పొందుతారని ప్రగాఢ విశ్వాసం. హిందూ పంచాంగం ప్రకారం పుష్య పౌర్ణమి తిథి 2న సాయంత్రం 6 గంటల 53 నిమిషాలకు ప్రారంభమై 3న మధ్యాహ్నం 3: 32 నిమిషాలకు ముగుస్తుంది.
ఉదయ తిథి ఆధారంగా పుష్య పౌర్ణమి వ్రతాన్ని 3వ తేదీన శనివారం నాడు పాటిస్తారు. ఈ రోజున చంద్రుడు సాయంత్రం 5: 28 నిమిషాలకు ఉదయిస్తాడు. పంచాంగం ప్రకారం పుష్య పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, దానధర్మాలు చేయడం అత్యంత శుభప్రదం. 3న ఈ ముహూర్తం తెల్లవారు జామున 5:25 నుండి 6:20 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తంలో కూడా దానధర్మాలు చేయవచ్చు. ఈ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:46 నిమిషాల వరకు ఉంటుంది.
ఈ పవిత్ర తిథిలో చేసే దానం వ్యక్తి కష్టాలను దూరం చేసి, జాతకంలోని ప్రతికూల గ్రహ ప్రభావాలను శాంతింపజేయడానికి ఉపకరిస్తుందని ధార్మిక విశ్వాసం. పౌర్ణమి రోజున తెల్లని రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున పాలు, బియ్యం, చక్కెర, వెండి, తెల్లని వస్త్రాలు, తెల్ల చందనం వంటివి దానంగా ఇవ్వవచ్చు. పాయసాన్ని ప్రసాదంగా పంచడం కూడా పుణ్యమే. నిస్సహాయులకు దుప్పట్లు, ఉన్ని వస్త్రాలు, బియ్యం, గోధుమలు, నువ్వులు, బెల్లం, నెయ్యి, పాలు దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది.












Click it and Unblock the Notifications