ఈ రోజున విష్ణువును స్మరించినా చాలు.. సిరులు కురుస్తాయి
కార్తీక మాసంలో వచ్చే దేవ ఉత్థాన ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగనిద్ర నుండి మేల్కొంటాడని భక్తులు నమ్ముతారు. దీనిని ప్రబోధినీ ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ముగియడంతో పాటు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి.
హిందూ పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి నవంబర్ 1వ తేదీ ఉదయం 9:11 గంటలకు ప్రారంభమై నవంబర్ 2వ తేదీ ఉదయం 7:31 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉన్నందున, దేవ ఉత్థాన ఏకాదశిని నవంబర్ 2, 2025 (ఆదివారం)న జరుపుకుంటారు. వ్రత పారణ (ఉపవాసం విరమించే సమయం) నవంబర్ 3, 2025 ఉదయం 5:48 నుండి 8:03 మధ్య ఉంటుంది.

దేవ ఉత్థాన ఏకాదశి: ప్రాముఖ్యత
దేవ ఉత్థాన ఏకాదశి విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనే రోజుగా ప్రసిద్ధి. ఇది దైవిక శక్తి మేల్కొలుపునకు ప్రతీక. ఈ రోజున ఉపవాసం పాటిస్తూ, ప్రార్థనలు చేయడం వల్ల శ్రేయస్సు, సామరస్యం, మోక్షం లభిస్తాయని నమ్ముతారు. శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సంతోషం, విజయం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.
తులసి వివాహం, ఇతర ఆచార వ్యవహారాలు..
దేవ ఉత్థాన ఏకాదశి రోజున తులసి వివాహ పూజలు చేస్తారు. ఇది శ్రీమహావిష్ణువు, తులసి శాలిగ్రామ రూపంతో జరిపే వివాహ వేడుక. ఈ ఆచారం హిందూ సంస్కృతిలో శుభకార్యాలు తిరిగి ప్రారంభమవడానికి సూచన. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ప్రబోధినీ ఏకాదశిని ఘనంగా జరుపుకుంటారు. రాజస్థాన్‌లో పుష్కర్ మేళా ఈ రోజునే ప్రారంభమవుతుంది. మహారాష్ట్రలో పండరీపూర్ యాత్ర ప్రార్థనలు, భజనలతో ముగుస్తుంది.
స్కంద పురాణం ప్రబోధినీ ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తుంది. బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ఏకాదశి ప్రాముఖ్యతను చెబుతూ, దీనిని భక్తిశ్రద్ధలతో పాటించేవారు పాపాల నుండి విముక్తులై వైకుంఠాన్ని పొందుతారని పేర్కొన్నారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది.
పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదాభ్యాసం, ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి కోటిరెట్ల ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం. పేదవారికి వస్త్రదానం, పండ్లు, ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి.












Click it and Unblock the Notifications