కల్వర్ట్ నుంచి వాగులోకి... స్కూల్ బస్సు బోల్తా, 20 మందికి గాయాలు
గుంటూరు : వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం స్కూలుకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పలపాడు గ్రామానికి చెందిన 50 మంది విద్యార్థులు.. మాచర్లకు చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నారు. మండాది వాగు దగ్గర.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది.

కల్వర్టు మీద నుంచి బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడ్డ మిగతావారికి మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.