మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు షాక్; ఆయనకు నచ్చని నేతకు కీలక పదవి!!
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చిందా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ కష్టమేనా? పొమ్మనకుండానే పొగ పెడుతున్నారా? ఆయనకు నచ్చని నాయకులకు పార్టీలో కీలకపదవులు ఇచ్చి పెద్ద పీట వేస్తున్నారా? అనే అవును అన్న సమాధానమే వస్తుంది.
ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి కష్ట కాలం వచ్చి పడింది. సొంత నియోజకవర్గంలోనే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు, జగన్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది అని ప్రచారం జరుగుతుండగా, ఇక ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ తాజాగా సీఎం జగన్ ఆయనకు మరో మరో షాక్ ఇచ్చారు.

దొంతి రెడ్డి వేమారెడ్డి ని మంగళగిరి వైసీపీ అధ్యక్షుడు గా నియమించి ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి చెక్ పెట్టారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డికి స్థానికంగా, సొంత పార్టీలో మింగుడుపడని నేత అయిన దొంతి రెడ్డి వేమారెడ్డికి మంగళగిరి వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన దొంతిరెడ్డి వేమారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వచ్చిన తర్వాత పార్టీలో కాస్త సైలెంట్ అయ్యారు.
ఎమ్మెల్యే ఆర్కే కు వేమారెడ్డికి మధ్య పొసగక పోవడంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో వేమారెడ్డి కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి జగన్ ఏదైనా అవకాశం ఇస్తారని ఎదురుచూస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినా పార్టీ ఫిరాయించి వచ్చిన నేత మురుగుడు హనుమంత రావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ వేమారెడ్డి సైలెంట్ గా తనకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో వైయస్ జగన్ ఎమ్మెల్యే ఆర్కే అమెరికా పర్యటనలో ఉండగా మాట మాత్రం చెప్పకుండా రాత్రికి రాత్రి వేమారెడ్డికి కీలక పదవిని కట్టబెట్టారు. అంతేకాదు ఎమ్మెల్యే ఆర్కే కు వీర విధేయులుగా పనిచేసే మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావును, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డిని పదవి నుంచి తప్పించేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే కు పొమ్మనకుండా పొగ పెడుతున్నట్టు సొంత పార్టీలోని నేతలే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications