'ఆమె' కళ్లల్లో ఆనందం చూడటం కోసం?
రైతులకు డబ్బులు చెల్లించకుండా మోసం చేయాలని చూసిన ఓ వ్యక్తి డ్రామాలాడాడు. అయితే అది డ్రామానే అని పోలీసులు నిరూపించడంతో కటకటాలపాలయ్యాడు. అసలు ఎందుకు చేశాడో కారణం కనుక్కున్న పోలీసులు అవాక్కయ్యారు. గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన గురించి సీఐ సురేష్ బాబు మీడియాకు వివరించారు.

10 సంవత్సరాలుగా పత్తి వ్యాపారం
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన గంధం శ్రీను 10 సంవత్సరాలుగా పత్తి వ్యాపారం చేస్తున్నాడు. రైతుల దగ్గర నుంచి పత్తిని కొని, వాటిని గుంటూరులోని మిల్లులకు విక్రయిస్తాడు. ఆ డబ్బులు తీసుకొని రైతులకు చెల్లిస్తుంటాడు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వ్యసనాలకు అలవాటుపడ్డాడు. చెడు వ్యసనాలతోపాటు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కంతేరు గ్రామానికి చెందిన కొందరు రైతుల వద్ద గంధం శ్రీను పత్తి కొనుగోలు చేశాడు. ఆ పత్తిని గుంటూరులోని కాటన్ మిల్లుకు విక్రయించగా వచ్చిన రూ..2లక్షలు నగదు తీసుకుని ఈనెల 19వ తేదీ సాయంత్రం గుంటూరు నుంచి బండిపై బయలుదేరాడు. రైతులను మోసం చేసి వారి డబ్బును ఎలాగైనా సరే తస్కరించాలనుకున్నాడు. తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమారుడిని పిలిచి చిలకలూరిపేట-విజయవాడ జాతీయ రహదారిపై రూ.2 లక్షలు అందించాడు.

దాడిచేశారని నమ్మించేందుకు..
ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేసి డబ్బులు దోచుకున్నారని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. తన తలను రోడ్డు పక్కన ఉన్న కాంక్రీట్ కుప్పమీద గుద్దుకున్నాడు. డబ్బులు తెచ్చిన సంచిని కూడా అక్కడే పడేసి తన సెల్‌ఫోన్‌ను కూడా పగులగొట్టుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడిచేసి డబ్బులు తీసుకెళ్లారని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. దీనివల్ల రైతులు నమ్ముతారని శ్రీను భావించాడు. వారు వచ్చి శ్రీనును చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులను కూడా నమ్మించేందుకు మీడియాకు కూడా సమాచారమిచ్చాడు.

పోలీసులకు అనుమానం రావడంతో..
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అక్కడ దోపిడీ జరిగిన ఆనవాళ్లే కనపడలేదు. శ్రీను చెబుతున్నదానికి, ఘటన జరిగిన తీరుకు పొంతన కుదరకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపెట్టాడు.
తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే ఇదంతా చేశానని చెప్పాడు. నిందితుడిని అరెస్టు చేసి రూ.2లక్షల నగదు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications