అద్దంకి సిద్ధంపై కీలక అప్‌డేట్..
Addanki Siddham meeting: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పర్యటనలను నిర్వహిస్తోన్నారు. జనంలోకి దూసుకెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఇప్పటికే మూడు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వాటిని నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నం జిల్లా భీమిలి, ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో లక్షలాది మంది జనం మధ్య ప్రసంగించారు వైఎస్ జగన్.
ఒకదాన్ని మించి మరొకటి.. అన్న విధంగా సాగాయి ఈ సభలన్నీ కూడా. రాప్తాడులో ఏర్పాటు చేసిన సభ.. రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టుకు అద్దం పట్టింది. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లాల నుంచీ జనాన్ని తరలించడంలో పార్టీ నాయకులు విజయం సాధించారు.

ఇక నాలుగో సిద్ధం బహిరంగ సభను నిర్వహించడానికి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం సమాయాత్తమౌతోంది. తొలుత మార్చి 3వ తేదీన బాపట్ల జిల్లాలోని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల కొర్సిపాడు మండలం, పిచ్చికలగుడిపాడు జాతీయ రహదారి వద్ద చివరి విడతగా సిద్ధం మహాసభను నిర్వహించాలని నిర్ణయించింది.
చివరి నిమిషంలో ఈ సిద్ధం సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతోండటం, ఈ నెల 29వ తేదీన నిర్వహించ తలపెట్టిన నిధుల విడుదల కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీకి వాయిదా వేయడం వంటి కారణాలు.. సిద్ధం సభ వాయిదాకు కారణమైనట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి కొద్దిరోజుల ముందు అంటే మార్చి 10వ తేదీన ఈ నాలుగో/చివరి విడత సిద్ధం బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు నిర్వహించ తలపెట్టిన అదే ప్రదేశంలోనే మార్చి 10వ తేదీన సిద్ధం సభ ఉండొచ్చని చెబుతున్నారు.
తొలి మూడు సభలను మించి పోయేలా సుమారు 15 లక్షల మంది వరకు జనాన్ని సమీకరించాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. అదే సభలో మేనిఫెస్టోను సైతం జగన్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications