మరో ఘోరం : హైదరాబాద్ శివారులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్.. పట్టపగలే..
హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటనను ఇంకా మరిచిపోకముందే.. నగర శివారులోని అమీన్‌పూర్ సమీపంలో మరో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా కారులో తీసుకెళ్లిన ముగ్గురు యువకులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మద్యం మత్తులోనే యువకులు బాలికపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డట్టు సమాచారం. బాలిక ఆచూకీ దొరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు 100కి డయల్ చేశారు. పోలీసుల సాయంతో ఎట్టకేలకు ఆమె ఆచూకీని గుర్తించారు.

ఎలా జరిగింది..
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణి నగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంటులో బాధిత బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇదే క్రమంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధిత బాలిక సమీపంలోని కిరాణ షాపుకు వెళ్లింది. షాప్ నుంచి తిరిగొస్తున్న క్రమంలో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ కారులోని ముగ్గురు యువకులు
ఆమెను బలవంతంగా లోపలికి ఎక్కించారు. అప్పటికే మద్యం సేవించిన ముగ్గురు.. అమీన్‌పూర్‌కి 2కి.మీ దూరంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అక్కడే వదిలేసి..
అత్యాచారం అనంతరం బాలికను అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. రోడ్డుపై వెళ్తున్న కొంతమంది వ్యక్తులు అటువైపు వెళ్లి చూశారు. స్థానికులకు సమాచారం అందించగా బాలిక వద్దకు వెళ్లి వివరాలు అడిగారు. అప్పటికీ ఆమె వివస్త్రగానే ఉన్నట్టు చెబుతున్నారు. అప్పటికే కుమార్తె కోసం గాలించిన తల్లిదండ్రులు 100కి డయల్ చేయడంతో.. బాధితురాలి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.

ఈరోజు రాత్రికే నిందితులను పట్టుకునే ఛాన్స్
బాలిక నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చెప్పారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కార్ నంబర్,రోడ్డుపై ఉన్న సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. ఈరోజు రాత్రికే నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

దిశ ఘటన మరవకముందే..
సంఘటనా స్థలంలో పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు కూడా నిందితులను గుర్తుపడుతానని పోలీసులకు చెప్పింది. కాగా,దిశ సంఘటన జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. అదీ కూడా పట్టపగలు.. రోడ్డుపై వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications