విషాదం: ఆడుకుంటూ మస్కిటో లిక్విడ్ తాగేసిన బాలుడు, మృతి
హైదరాబాద్: నగరంలోని చందానగర్‍లో విషాదం చోటు చేసుకుంది. ఏడాదిన్నర వయస్సున్న బాలుడు ఆడుకుంటూ మస్కిటో లిక్విడ్ తాగాడు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై అతడు మరణించాడు. బాలుడి మృతితో అతడి కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్‌కు చెందిన జుబేర్ కొడుకు అబ్బు జాకీర్ ఆడుకుంటూ ఆడుకుంటూ అనుకోకుండా మస్కిట్ కిల్లర్ ఆలౌట్ లిక్విడ్‌ను తాగాడు. ఏడుస్తుండటం, బాలుడి బట్టలపై ఆలౌట్ వాసన రావడంతో అనుమానం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మరో కోణం ఏమైనా ఉందా? అని విచారిస్తున్నారు. బాలుడి తల్లిదండ్రులను ఘటనపై విచారిస్తున్నారు. ప్రాథమికంగా బాలుడు అనుకోకుండా లిక్విడ్ తాగాడని నిర్ధరించారు.
కాగా, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నతనంలో వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. వారికి విషయాలు తెలిసే వరకూ తల్లిదండ్రులే బాధ్యతగా వారిని ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications