Hyderabad: డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు, రచయిత అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ ఫైనాన్షియర్లు, ఇతర నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సినీ దర్శకుడు మంతెన వాసువర్మను మాదాపూర్ పోలీసులు సెప్టెంబర్ 5న అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
ఇదే కేసులో సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్ దివాకర్, పుణేకు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు రాహుల్ అశోక్ తెలోర్ జూన్‌లో అరెస్టయ్యారు. అయితే, వీరి అరెస్టును గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన విక్టర్, పుణెలో ఉంటున్న రాహుల్ అశోక్ తెలోర్ పరిచయస్తులకు డ్రగ్స్ విక్రయిస్తుంటారని తెలిసింది.

ఈ క్రమంలో రాహుల్, విక్టర్ నుంచి నార్సింగికి చెందిన పృథ్వీకృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేసి వినియోగించేవాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గత జూన్ 19న పృథ్వీకృష్ణ, రాహుల్ ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుకున్నారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో 'బస్తీ' సినిమా దర్శక, నిర్మాత, ఓ ట్రస్ట్ ఛైర్మన్, శేరిలింగంపల్లిలో ఉంటున్న మంతెన వాసువర్మ కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.
దర్యాప్తులో భాగంగా మాదాపూర్ పోలీసులు సెప్టెంబర్ 5న వాసువర్మను అరెస్ట్ చేశారు. వాసువర్మ, పృథ్వీకృష్ణ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసే విక్టర్ పరారీలో ఉన్నాడు. అయితే, ఈ విషయాలన్నింటినీ పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తులో భాగంగా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.
కాగా, గత రెండ్రోజుల క్రితం సినీనటుడు నవదీప్‌ను మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డిలీట్ చేసిన డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పోలీసుల విచారణకు సహకరించినట్లు నవదీప్ తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పారని తెలిపారు.












Click it and Unblock the Notifications